అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు ఇవ్వాల్సిందే.. అన్ని పార్టీలకు పద్మశాలీల డిమాండ్​

కోరుట్ల, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 24 సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీలను  పద్మశాలీలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కోరుట్లలో జరిగిన ‘పద్మశాలీ రాజకీయ యుద్ధ భేరీ’లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. జనాభా ప్రాతిపదికన తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదని అన్నారు. బతుకు దెరువులేక రాష్ట్రంలోని పద్మశాలీలు భివండి, షోలాపూర్​, సూరత్​కు వలస పోతున్నారని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. పద్మశాలీలంతా  రాజకీయాలకు అతీతంగా సంఘటితం కావాలని, అన్ని రంగాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని నేతలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల లోని కావేరి గార్డెన్ సమీపంలో ఆదివారం ‘పద్మశాలీ రాజకీయ యుద్ధభేరీ ఆత్మ గౌరవ సభ’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో అధికారం లేకపోతే ఎవరూ దగ్గరికి రావడం లేదన్నారు. పరస్పర సహకారంతో చట్టసభల్లో పెద్దసంఖ్యలో పద్మశాలీలు ఉండేలా కృషి  చేసి, తమదైన అస్థిత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. పద్మశాలీ యుద్ధ భేరీ ఆత్మగౌరవ సభ ఒక ప్రభంజనం సృష్టిస్తున్నదని చెప్పారు. చట్టసభలకు పోటీచేసే పద్మశాలీలకు  మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. 

చేనేత రంగం రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉందని ఎమ్మెల్సీ ఎల్​.రమణ అన్నారు. ఉమ్మడి ఏపీ లో ఉన్నప్పుడు చేనేత వివర్స్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని, జగిత్యాలలో పద్మశాలీల గర్జన నిర్వహించామని చెప్పారు. నేత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం చేనేత బజార్  నిర్వహిస్తున్నదన్నారు. చేనేత కార్మికుల కష్టాలను సీఎం కేసీఆర్, మంత్రి  కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. పద్మశాలీల ఆత్మ గౌరవ సభ తీర్మానాలను అమలు చేసేలా సీఎం కేసీఆర్ ను కలిసి  కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పద్మశాలీ కుల బాంధవులు అస్థిత్వాన్ని చాటుకునే సమయం ఆసన్నమైందని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. పద్మశాలీ లు సైనికుల్లాగా పని చేసి,  అన్ని పార్టీల్లో  బలాన్ని, బలగాన్ని చాటుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని జనరల్  స్థానాల్లో పద్మశాలీలు పోటీ చేయాలని మాజీ ఎంపీ  రాపోలు ఆనంద భాస్కర్  సూచించారు. 

చట్టసభల్లో ఉంటేనే సమస్యలు పరిష్కారం: బస్వా లక్ష్మీనర్సయ్య

పద్మశాలీల నుంచి ఎంతో మంది అధికారులు, ఉన్నత విద్యా వంతులు ఉన్నారని, కానీ చట్టసభల్లో పద్మశాలీలు ఉంటేనే చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమవుతాయని యుద్దభేరి సభ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బస్వా లక్ష్మీనర్సయ్య తెలిపారు. బీసీలలో అతి పెద్ద కులం పద్మశాలీ అని, చట్టసభల్లో మనం ఉండాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ నుంచైనా సరే పద్మశాలీ లు చట్ట సభల్లో అడుగు పెట్టాలని ఆయన అన్నారు. పద్మశాలీల చరిత్రలో ఒకే సారి ఇంత మంది గుమిగూడడం ఇదే మొదటిసారి అని  పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ అన్నారు. 24 అసెంబ్లీ స్థానాల్లో  పద్మశాలీలు బలంగా ఉన్నారని, ఆ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు  టికెట్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అనంతరం ఇదే అంశంపై నేతలు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 వేలకు పైగా పద్మశాలీలు సభకు హాజరయ్యారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్తి అనిల్,  పద్మశాలీ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, సాంబారి ప్రభాకర్, భోగ వెంకటేశ్వర్లు, భోగ శ్రావణి, గడ్డం మధు, జిల్లా ధనుంజయ్, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, మార్త రమేశ్​, అన్ని జిల్లాల అధ్యక్ష,  కార్యదర్శులు పాల్గొన్నారు. 

పార్టీల్లో వివక్ష: సంజీవ్​ కుమార్​​

కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్​ కుమార్  మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య జన్యుపరమైన సంబంధం ఉందని, అందరూ సంఘటితంగా ఉండి, చేనేత కార్మికుల హక్కులు సాధించుకోవాలన్నారు. రాజకీయ పార్టీల్లో పద్మశాలీలపై వివక్ష ఉందని మండిపడ్డారు. తెలంగాణలో 20 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచే సత్తా పద్మశాలీలకు ఉందని అన్నారు.