
- మయన్మార్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న బాధితులు
- హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడిన వ్యక్తులపై కేసు
కరీంనగర్, వెలుగు : ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్లి మోసపోయి, మయన్మార్‌లో చైనీస్ సైబర్ స్కామ్ కాంపౌండ్స్‌లో చిక్కుకున్న 24 మంది తెలంగాణ యువకులు ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమ, మంగళవారాల్లో రెండు విడతలుగా ఢిల్లీ చేరుకున్న వారిని పోలీసులు తెలంగాణకు తరలించారు. ఈ నెల 10న ఢిల్లీ చేరుకున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ షోయబ్, అఫ్గాన్ అహ్మద్, దావుద్‌ఖా, జుబేర్, ఖాజా జౌఖీ, అజీం, అబ్దుల్ కరీం షాహనవాజ్, అబ్దుల్ రహమాన్, జెయిద్, దేశిడి కార్తీక్ రెడ్డి, గోర్త రమణ, జగిత్యాల జిల్లాకు చెందిన దేశెట్టి రాకేశ్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నారు.
అలాగే 11న ఢిల్లీకి చేరుకున్న వారిలో సిరిసిల్ల వెంకంపేటకు చెందిన కె.అరవింద్, కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కాటం దేను, కుక్కల వినీత్‌రెడ్డి, కములు శంకర్ శ్రీనివాస్, హుస్సేన్ షేక్, మహ్మద్ షాబాజ్, అర్బజ్ బిన్ బాబాజెర్, సంతోష్, మహ్మద్ రియాజ్ ఉన్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. వీరి క్షేమ సమాచారం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు.
బాధితుల ఫిర్యాదుతో కేసులు
మయన్మార్ నుంచి తిరిగొచ్చిన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. జగిత్యాల టౌన్ అన్నపూర్ణ చౌరస్తాలోని మల్లికార్జున మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అల్లెపు వెంకటేశ్ ఇదే జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన దేశెట్టి రాకేస్‌నుమోసం చేయడంతో వెంకటేశ్‌పై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాకేశ్‌ను వెంకటేశ్ జనవరి 12న థాయిలాండ్‌కు పంపాడు.
అక్కడ వెంకటేశ్‌కు సంబంధించిన వ్యక్తులు కలిసి రాకేశ్‌ను బ్యాంకాక్ తీసుకెళ్లి, సరైన ఉద్యోగం చూపించకుండా ఓ సైబర్ క్రైమ్ ముఠాకు అప్పగించారు. మయన్మార్ నుంచి తీసుకొచ్చిన 540 మంది ఇండియన్లలో రాకేశ్ కూడా ఒకరు. అతడు బుధవారం జగిత్యాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కరాల మధుకర్‌రెడ్డిని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యాంరావు రాజశేఖర్, గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌కు చెందిన హితేశ్ అర్జున సోమ్య నమ్మించి మయన్మార్‌లోని సైబర్ స్కామ్ కాంపౌండ్స్‌కు అప్పగించారు.
మధుకర్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మిగతా బాధితుల నుంచి కూడా పోలీసులు ఫిర్యాదులు తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా
ఈ కేసును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేస్తోందని డైరెక్టర్ శిఖా గోయెల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగ అవకాశాల పేరుతో యువతను మోసం చేసి అక్రమంగా విదేశాలకు తరలించడంలో బాధ్యులైన వారిని త్వరలోనే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
జాబ్ ఆఫర్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ (ఎంఈఏ) అఫిషీయల్ వెబ్‌సైట్ https://emigrate.gov.in ద్వారా నిర్ధారించుకోవాలని, ప్రయాణానికి ముందే ఫారిన్ కంపెనీతో రాతపూర్వక అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. విదేశీ ఉద్యోగాల మోసానికి గురై ఉంటే 1930 నంబర్‌కి కాల్ చేయాలని, లేదంటే www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.