మూడురోజుల్లో 24 వేల అప్లికేషన్లు

  •  యాదాద్రి జిల్లాలో ‘గృహలక్ష్మి’కి అప్లికేషన్ల వెల్లువ
  • జనాలతో మీసేవ, జిరాక్స్, ఫొటో స్టూడియోలు కిటకిట
  • మహిళల పేరుతో స్థలాలు లేకున్నా.. దరఖాస్తు చేస్తున్నరు

యాదాద్రి, వెలుగు : సొంత జాగా ఉన్నోళ్లకు రూ.3 లక్షలు ఇస్తామని సర్కారు తీసుకొచ్చిన ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు అప్లికేషన్లు వెల్లువెత్తాయి. తొమ్మిదేండ్లైనా డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్లు రాకపోవడంతో జనాలు ఈ పథకం కోసం మీసేవ, తహసీల్దార్‌‌, మున్సిపల్ ఆఫీసుల వద్దకు పరుగులు పెడుతున్నారు.  మహిళల పేరుపై ఇంటి స్థలాలు లేకున్నా.. భర్త పేరుపై ఉన్న ఇంటి స్థలంతో అప్లై చేసుకుంటున్నారు.  యాదాద్రి జిల్లాలో మూడు రోజుల్లోనే 24,797  వేల అప్లికేషన్లు వచ్చాయి.  క్యాస్ట్, ఇన్​కం సర్టిఫికెట్లు, ఫొటోలు, ఆధార్​, ఫుడ్​ సెక్యూరిటీ కార్డు జిరాక్సులకు కలిసి రూ. 300  వరకు ఖర్చవుతోందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. 

3 రోజుల గడువుతో గందరగోళం 

గృహలక్ష్మి స్కీం కింద అప్లై చేసుకోవాలని ఈ నెల 7న సాయంత్రం స్టేట్​మెంట్ ఇచ్చిన సర్కారు మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చింది.  దీంతో జనాలు మీ సేవ, తహసీల్దార్‌‌, మున్సిపల్ ఆఫీసుల వద్దకు పరుగులు తీశారు.  కానీ, చాలాచోట్ల సెంటర్లు పెట్టకపోవడం, చాలామందికి క్యాస్ట్‌, ఇన్‌కం సర్టిఫికెట్లు లేకపోవడంతో గందరగోళం నెలకొంది.  దీంతో సర్కారు అప్లికేషన్లు నిరంతర ప్రక్రియ అని ఇంకో ప్రకటన రిలీజ్ చేసింది.  అయినప్పటికీ చాలామందికి ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు లేకపోవడంతో అప్లై చేసుకునే అవకాశం లేకుండా పోయింది.  

మహిళల పేరుపై స్థలం లేకున్నా..
 

మహిళలు మాత్రమే అప్లికేషన్లు పెట్టుకోవాలని సర్కారు సూచించింది. కానీ, ఇండ్ల స్థలాలు చాలావరకు మగవాళ్ల పేర్ల మీదే ఉంటాయి. దీంతో గందరగోళంగా మారింది. అయితే ఫుడ్​సెక్యూరిటీ కార్డు, ఆధార్‌‌లో భర్త పేరు ఉంటుంది కాబట్టి.. స్థలాలు మగవాళ్ల పేర్ల మీద ఉన్నా  మహిళల పేర్లతో అప్లికేషన్లు చేస్తున్నారు.  కాగా, ఉద్యోగాల విషయంలో ఇబ్బంది పడుతున్నందనే ఉద్దేశంతో కొందరు చదువుకున్న మహిళలు పెండ్లి అయినా  తండ్రి ఇంటి పేరుతోనే ధ్రవీకరణ పత్రాలు కొనసాగిస్తున్నారు. ఇదే వీరికి ఇబ్బందిగా మారింది. 

భారీగా అప్లికేషన్లు

సర్కారు సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని 2015లో  ప్రకటించింది. ఆ తర్వాత డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇస్తామని చెప్పింది. కానీ, తొమ్మిదేండ్లవుతున్నా అటు డబుల్​ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వలేదు. ఇటు సొంత జాగా ఉన్నోళ్లకు పైసలివ్వలేదు.  తాజాగా ఎన్నికలు సమీపిస్తుండడంతో గృహలక్ష్మి స్కీమ్​తీసుకొచ్చి అప్లికేషన్లకు అవకాశం ఇచ్చింది.  దీంతో ఎప్పటి నుంచో సొంతింటి కోసం ఎదురు చూస్తున్న పేదలు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు.  సర్కారు ప్రకటించిన ప్రకారం యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో మొదటి విడతలో 6 వేల మందికి లబ్ధి కలుతుంది. అయితే మూడు రోజుల్లోనే 24,797 మంది అప్లై చేసుకున్నారు. 

ఎన్నికల కోసమే 

ఇన్నేండ్లు మౌనంగా ఉండి... ఇప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్​ ప్రభుత్వం గృహలక్ష్మి స్కీమ్​ ప్రకటించింది.  జిల్లాలో అర్హులైన కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. అప్లికేషన్​ పెట్టుకున్న అర్హులైన వారందరికీ ఒకే విడతలో ఇండ్ల నిర్మాణం కోసం లోన్లు విడుదల చేయాలి.  

- పీవీ శ్యాంసుందర్​ రావుబీజేపీ, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు