కెనడాలో ఇండియన్​ స్టూడెంట్​ హత్య .. కారులో ఉండగా కాల్చి చంపిన దుండగులు

వాంకోవర్: కెనడాలోని వాంకోవర్​సిటీలో ఇండియన్ స్టూడెంట్ దారుణ హ్యతకు గురయ్యాడు. అతను కారులో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి చంపేశారు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన చిరాగ్ అంటిల్(24) ఎంబీఏ చదవడం కోసం స్టూడెంట్ వీసాపై 2022లో కెనడాలోని వాంకోవర్‌కు వచ్చాడు. ఎంబీఏ పూర్తి చేసి ఇటీవలే అతను ఉద్యోగంలో చేరాడు. సౌత్ వాంకోవర్​లో ఉంటున్న అతను ఈ నెల 12న రాత్రి తన ఆడి కారులో బయటకు వెళ్లాడు. ఈస్ట్ 55 ఎవెన్యూ మెయిన్ స్ట్రీట్​లో పోలీసులకు కాల్పుల శబ్దం వినిపించడంతో అటువైగా వెళ్లారు. 

అక్కడి వెళ్లేసరికి కారులో బుల్లెట్ గాయాలతో చిరాగ్ చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్పారు. వాంకోవర్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా చిరాగ్ మృతిపై విచారం వ్యక్తం చేసింది. ‘‘వాంకోవర్‌లో నివసిస్తున్న చిరాగ్​ను హత్యకు గురవడం బాధ కలిగించింది. ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలని కెనడా అధికారులను కోరాం” అని ‘ఎక్స్’​లో పోస్ట్ చేసింది. హత్యకు గురైన చిరాగ్​ సోదరుడు రోనిత్ ఇండియాలో మీడియాతో మాట్లాడుతూ.. అంత్యక్రియల నిమిత్తం చిరాగ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ, జైశంకర్​కు విజ్ఞప్తి చేశారు.