- ఉమ్మడి వరంగల్లో సాగుకు యోగ్యంకాని 24,239 ఎకరాలు
- అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 6,852 ఎకరాలు
- అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 513 ఎకరాలు
- ఆఫీసర్ల సర్వేలో రిపోర్ట్
వరంగల్/ మహబూబాబాద్/ జనగామ, వెలుగు: ఓరుగల్లు ఆరు జిల్లాల్లో రాళ్లురప్పలు, గుట్టలు, గ్రానైట్ భూముల వంటి వ్యవసాయ సాగుకు యోగ్యం కాని భూములు సుమారు 24,239 ఎకరాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. వరంగల్ సిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మేజర్ ప్రాజెక్టులు చేపట్టే క్రమంలో ఇన్నాళ్లు అక్కడి భూములకు రైతుబంధు ఇవ్వగా, సాగులోలేని ఈ భూములకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల అగ్రికల్చర్ ఆఫీసర్లు వివరాలు అందించారు.
ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో సాగులోలేని భూములు 6,852 ఎకరాలు ఉండగా, అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాలో 513 ఎకరాలు మాత్రమే రైతుబంధు పరిధిలో లేనట్లు ఊరూరా చేపట్టిన సర్వేలో వెల్లడించారు.
గుట్టలు, వెంచర్లు, మైనింగ్ భూములకు రైతుబంధు
బీఆర్‍ఎస్ హయాంలో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 24,239 ఎకరాల సాగులోలేని భూములకు ఏండ్ల తరబడి కోట్లాది రూపాయల రైతుబంధు డబ్బులను అందించినట్లు తేలింది. గ్రేటర్ సిటీ పరిధిలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తప్పించి మిగతా నాలుగు జిల్లాల్లో ఇన్నాళ్లూ సాగు చేయలేని కొండలు, గుట్టలు, వెంచర్ల వంటి భూములకు రైతుబంధు పేరిట కోట్లాది రూపాయలను పంచారు. జనగామ జిల్లాలో సాగు యోగ్యతలేని భూములు 5,696 ఎకరాలు ఉండగా, జనగామ మండలం వెంకిర్యాలలో సర్వే నంబర్ 21లో 335.02 ఎకరాల రాళ్లురప్పల భూములున్నాయి.
పెద్దపహాడ్ రెవెన్యూ పరిధిలో ఏకంగా 27 ఎకరాల 27 గుంటల విస్తీర్ణంలో ఉన్న క్రషర్ ఉన్నట్లు తేల్చారు. ఇదే తరహాలో వడ్లకొండలో 191.37 ఎకరాలు, బచ్చన్నపేట మండలంలో 650 ఎకరాలున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం అమ్మాపురం పరిధిలో 30 ఏండ్లుగా గ్రానైట్ తీస్తున్న 46 ఎకరాల భూములకు ఇన్నాళ్లు రైతుబంధు అందించారు. కేసముద్రంలో 6 ఎకరాల పరిధిలో ఉన్న బిన్న రైస్ మిల్‍కు అందించారు. ఇలా వేలాది ఎకరాల భూములకు గత సర్కార్ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు అప్పనంగా జేబుల్లోపెట్టారు.
కొత్త ప్రాజెక్టుల్లో.. వరంగల్ సిటీ భూములు
ఉమ్మడి ఆరు జిల్లాల్లో ప్రధానంగా వరంగల్ జిల్లా విలీన గ్రామాల పరిధిలో ఉండే పలు భూములను అధికారులు సాగు యోగ్యత లేని భూముల్లో లెక్కకట్టారు. ప్రధానంగా మామునూర్ ఎయిర్‍పోర్ట్, ఐఆర్‍ఆర్, ఓఆర్‍ఆర్, కాకతీయ మెగా టెక్స్టైల్పార్క్ వంటి మేజర్ ప్రాజెక్టులు వచ్చే భూములను అధికారులు సాగు భూముల జాబితాలోనుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఎయిర్‍పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చే ఖిలా వరంగల్ మండల పరిధిలో 479.08 ఎకరాలు, సంగెం మండలం 378.27 ఎకరాలు, గీసుగొండ మండలం 297.05 ఉండగా, ఇన్నర్ రింగ్‍రోడ్‍తోపాటు వెంచర్లు కలిగిన వరంగల్ మండలం పరిధిలో 337.3 ఎకరాలు సాగులో లేనట్లు అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందించారు.
సాగుకు యోగ్యంకాని భూముల వివరాలు జిల్లాల వారీగా
వరంగల్ 2,357
హనుమకొండ 6,121
మహబూబాబాద్ 6,852
జనగామ 5,696
ములుగు 2,700
భూపాలపల్లి 0,513