హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగిసింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున మొత్తంగా 25,622 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలవగా, 24,454 మంది అటెండ్ అయ్యారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలోని టీచర్ పోస్టులకు సంబంధించి 18 జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు.
కాగా, వీటిలో ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా, వారికి ఆదివారం నిర్వహించనున్నారు. అయితే, ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, దానికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.