- అరెస్ట్ ఎప్పుడన్నది కాదు.. అదుపులోకి ఎప్పుడన్నదే ముఖ్యమని వ్యాఖ్య
- 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి
- గడువు దాటితే విడుదల చేయాల్సిందేనన్న న్యాయస్థానం
న్యూఢిల్లీ: ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి (కస్టడీ/డిటెన్షన్) తీసుకున్న మరుక్షణం నుంచే.. అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రాజ్యాంగం విధించిన 24 గంటల డెడ్‌లైన్ ప్రారంభం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పోలీసులు రికార్డుల్లో నమోదుచేసే అధికారిక అరెస్టు సమయం కాకుండా అదుపులోకి తీసుకున్నప్పటినుంచే ఆ సమయాన్ని లెక్కించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అరెస్ట్కూ, నిర్బంధానికీ మధ్య కృత్రిమ భేదాన్ని చూపించే అవకాశం పోలీసులకు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు పేర్కొంది. ‘అరెస్ట్ చేసిన ప్రదేశం నుంచి మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లడానికి పట్టే ప్రయాణ కాలాన్ని (ట్రావెల్ టైమ్) మాత్రమే ఈ 24 గంటల గడువు నుంచి మినహాయించవచ్చు.
అధికారిక అరెస్ట్‌కు ముందు పోలీసులు జరిపే విచారణ, సోదాలు లేదా వస్తువుల స్వాధీనం పేరిట గడిపిన కాలాన్ని 24 గంటల నుంచి మినహాయించడానికి వీల్లేదు. గడువు దాటిన తర్వాత కూడా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకపోతే, ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సిందే’ అని
న్యాయస్థానం స్పష్టం చేసింది. సుజిత్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు
పోలీసులు ఒక వ్యక్తిని ఏ తేదీన, ఏ సమయానికి అదుపులోకి తీసుకున్నారో మేజిస్ట్రేట్లు రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. 24 గంటల రాజ్యాంగ గడువును పోలీసులు సరిగ్గా పాటించారో లేదో స్వతంత్రంగా తనిఖీ చేయాలని నిర్దేశించింది.
పోలీసుల నిర్బంధ సమయం సమంజసంగా ఉందో లేదో పరిశీలించి, ఒకవేళ నిర్బంధ కాలం మితిమీరినట్లు తేలితే పోలీసు రిమాండ్‌ను తిరస్కరించే అధికారం మేజిస్ట్రేట్లకు ఉందని పేర్కొంది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒరిస్సా హైకోర్టు (అర్యమన్ పట్టనాయక్ కేసు), మద్రాస్ హైకోర్టు (కన్నన్ కేసు), కేరళ హైకోర్టు (అరుణ్ కె థామస్ కేసు) తీర్పులను తోసిపుచ్చింది. ఆ మూడు కేసుల్లోనూ అధికారిక అరెస్ట్‌కు ముందు నిర్బంధ వ్యవధిని 24 గంటల లెక్క నుంచి మినహాయించవచ్చని హైకోర్టులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
‘ఇద్దరు పిల్లల రూల్’ లార్జర్ బెంచ్‌కు రిఫర్
దేశంలో సంతానోత్పత్తి (ఫెర్టిలిటీ) రేటు క్రమంగా తగ్గుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో జనాభా విస్ఫోటనాన్ని అదుపు చేసేందుకు తెచ్చిన విధానాలను ప్రస్తుత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీని అడ్డుకునే చట్టాలు ప్రస్తుతం ప్రాధాన్యాన్ని కోల్పోయాయని కోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్రలోని కాకోడా గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైన మంగళ భీమ్రావ్ ఇంగ్లేకు ముగ్గురు పిల్లలు ఉన్నారని అనర్హత వేటువేశారు.
దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం విచారణ జరిపిన బెంచ్.. ఇద్దరు పిల్లల నిబంధన రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొంటూనే 2003లో జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కేసును లార్జర్ బెంచ్‌కు రిఫర్ చేసింది.
