
- ఈ ఏడాది నుంచి పంట బీమా పథకం అమలు
- దీనికోసం రూ.984.11 కోట్లు కేటాయింపు
- రైతు బీమాకు రూ.1,167.92 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు
- ఇందులో రైతు భరోసా స్కీమ్‌కే రూ.18 వేల కోట్లు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించింది. ఇందులో రైతు భరోసా పథకానికే రూ.18 వేల కోట్లు ప్రతిపాదించింది. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.10 వేలు అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న రైతు భరోసా స్కీమ్‌ను ప్రారంభించి, ఏటా ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో గత బడ్జెట్‌లో పెట్టుబడి సాయానికి రూ.15,075 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3 వేల కోట్లు పెంచింది. ఇక ఈ ఏడాది నుంచి పంట బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు బడ్జెట్‌లో రూ.984.11కోట్లు కేటాయించింది. గత ఆరేండ్లుగా పంట బీమా పథకం అమలు కావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే, గతేడాదే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. పంట బీమా అమలుతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టపోతే రైతులకు పరిహారం అందనుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నామని, దీని కింద రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. అలాగే రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, దీని కోసం రూ.1167.92 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది.
ఇవీ కేటాయింపులు..
బడ్జెట్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీకి రూ.18.75 కోట్లు, హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ.4.38 కోట్లు కేటాయించారు. ఫామ్ మెకనైజేషన్‌కు రూ.25.47 కోట్లు, రైతు వేదికలకు రూ.43.03 కోట్లు, విత్తనాల సబ్సిడీకి రూ.106.47 కోట్లు, సీడ్డకార్పొరేషన్కు రూ.6.24 కోట్లు, వ్యవసాయ కమిషన్‌కు రూ.కోటి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ.10 కోట్లు, నేచురల్ ఫామింగ్(సెంట్రల్స్కీమ్) మ్యాచింగ్ గ్రాంట్ రూ.1.59 కోట్లు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్‌కు రూ.36.50 కోట్లు, నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీ కోసం రూ.60.51 కోట్లు, నేషనల్ఆయిల్ ఫామ్ మిషన్ కోసం రూ.14.33 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (సెంట్రల్ స్కీమ్)కు స్టేట్ షేర్ కింద రూ.102.26 కోట్లు కేటాయించారు.
అగ్రి ఎక్స్‌టెన్షన్ సబ్ మిషన్‌కు రూ.25.15 కోట్లు, సీడ్ప్లాంటింగ్ మెటీరియల్ కోసం రూ.24.77 కోట్లు, నేషనల్ఈ–గవర్నెన్స్ ప్లాన్ కోసం రూ.14.34 కోట్లు, సాయిల్ హెల్త్ కోసం రూ.13.42 కోట్లు కేటాయింపులు చేశారు. ఇలా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కోసం మొత్తం రూ.312.07 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే రూ.115 కోట్లు ఎక్కువ.
హార్టికల్చర్‌కు నిధులు పెంపు..
ఈసారి బడ్జెట్‌లో హార్టికల్చర్‌కు నిధులు పెంచారు. ప్రగతి పద్దులో రూ.646.24 కోట్లు కేటాయించారు. ఇందులో మెక్రో ఇరిగేషన్‌కు రూ.20 కోట్లు, గ్రీన్‌హౌస్, పాలీహౌస్, షేడ్ నెట్, లూజ్ షేడ్, పెండాల్స్ఏర్పాటుకు రూ.10 కోట్లు, హార్టికల్చర్ యాక్టివిటీస్ కోసం రూ.44.53 కోట్లు, గవర్నమెంట్ గార్డెన్స్ అభివృద్ధికి రూ.4 కోట్లు, స్టేట్ స్కీమ్‌ల కోసం రూ.78.53 కోట్లు కేటాయింపులు చేశారు.
నేషనల్ హార్టికల్చర్ మిషన్ కోసం రూ.60.41 కోట్లు, పర్ డ్రాప్ మోర్ క్రాప్(మైక్రో ఇరిగేషన్) స్కీమ్‌కోసం రూ.161.46 కోట్లు, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ సాగుకు రూ.343.74 కోట్లు కేటాయించారు. మొత్తంగా హార్టికల్చర్‌లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం 567.70 కోట్లు ప్రఈతిపాదించారు.