అమరావతి, వెలుగు: ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల జాగాలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది నాటికి ఇళ్ల జాగాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మహిళల పేరుతో ఇళ్ల జాగాలను రిజిస్ర్టేషన్లు చేసి ఇస్తామన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల జాగాల్లో వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని స్పష్టం చేశారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి కొత్త ఇంటి తాళాలు వారి చేతికి అందిస్తామన్నారు. రాష్ర్టంలో 25 లక్షల మందికి ఉచిత ఇళ్ల జాగాల పంపిణీపై శుక్రవారం అమరావతిలోని క్యాంపు ఆఫీసులో సీఎం జగన్ అధికారులతో రివ్యూ చేశారు. పేదలకు పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించిన స్థలాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 శాతం ప్రాంతాల్లో స్థలాలు గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఫిబ్రవరి చివరికి పేదలకు ఇళ్ల జాగాలకు సంబంధించి లేఅవుట్లు పూర్తి చేసి ప్లాట్లు గుర్తిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇళ్లు లేని పేదలకు ఇంటి జాగాలు ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అమ్మ ఒడి పథకం తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతిపెద్ద కార్యక్రమం ఇళ్ల జాగాల పంపిణీయేనని పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలందరూ గ్రామ వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకునేలా కలెక్టర్లు పోస్టర్లు విడుదల చేసి ప్రచారం చేయాలని సూచించారు. ఇళ్ల జాగాల కోసం ప్రభుత్వం గుర్తించే స్థలాలు ఊరికి దగ్గరగా నివాసయోగ్యంగా ఉండాలన్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు, అక్రమిత స్థలాల్లో ఉంటున్న పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాతే ఖాళీ చేయించాలని సూచించారు.