హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటివరకు మెరుగైన వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 47.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది ఇప్పటిదాకా సాధారణ వర్షపాతం 37.8 సెంటీమీటర్లతో పోలిస్తే 25 శాతం అధికం. జులై నెలలో సాధారణ వర్షపాతం 22.9 సెం.మీ. కాగా.. 29.4 సెం.మీ.గా నమోదైంది. ఇది సాధారణం కంటే 29 శాతం అధికం. నిరుడు జులైలో సాధారణం కన్నా ఎక్కువగా 49 సెం.మీ. వర్షం కురిసినా.. అదంతా ఒక్క వారం రోజుల్లోనే నమోదైంది.
అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ, ఈ ఏడాది జులైలో మాత్రం దాదాపు అన్ని ప్రాంతాల్లో, అన్ని రోజులూ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్త సగటుతో పోలిస్తే వర్షపాతం ఎక్కువే నమోదైనా.. యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం వరుసగా 23 శాతం, 22 శాతం, 28 శాతం చొప్పున లోటు వర్షపాతం రికార్డయింది.
రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో ములుగు (97 సెం.మీ.), జయశంకర్ భూపాలపల్లి (78 సెం.మీ.), కుమ్రంభీం ఆసిఫాబాద్(72 సెం.మీ.), భద్రాద్రి కొత్తగూడెం(71 సెం.మీ.), పెద్దపల్లి (70 సెం.మీ.) టాప్ లో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారబాద్, మేడ్చల్, హైదరాబాద్, జనగామ, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం, మిగతా జిల్లాల్లో అధిక వర్షపాతం రికార్డయింది. కాగా, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో రెండు రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.