ప్రతి 100లో 25 మందికి ఏదో ఒక లక్షణం

ప్రతి 100లో 25 మందికి ఏదో ఒక లక్షణం

రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఫీవర్ సర్వేలో దీనిపై క్లారిటీ వస్తోంది. పల్లెల నుంచి పట్నం వరకు చాలా మందిలో కరోనా సింప్టమ్స్ గుర్తించారు వైద్య సిబ్బంది. చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉన్నట్టు హెల్త్ సిబ్బంది చెబుతున్నారు. సగటున ప్రతీ వంద మందిలో 25 నుంచి  30 మంది ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొవిడ్  లక్షణాలు కనిపించినా.. కొన్ని చోట్ల నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదంటున్నారు. 

ఫీవర్ సర్వేలో భాగంగా.. రెండు రోజుల్లో 29.26 లక్షల ఇళ్లను సర్వే చేశారు. ఇందులో జ్వరం, జలుబు వంటి  లక్షణాలున్న వారు లక్షా 28 వేల 79మంది ఉన్నారు. వీరిలో లక్షా 27 వేల 372 మందికి హోం ఐసోలేషన్ కిట్ లు అందించారు. మరోవైపు.. చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండానే ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు హెల్త్ స్టాఫ్ గుర్తించారు. కొద్ది రోజుల్లోనే కరోనా తీవ్రత తగ్గుతుండటంతో.. ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నరని చెబుతున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు  55 వేల ఇళ్లను హెల్త్ సిబ్బంది విజిట్ చేశారు. ఇందులో 2,200 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. వీటికి తోడు బస్తీల్లో చాలా మంది జ్వరం, జలుబు, దగ్గుతోనే ప్రైవేట్ క్లీనిక్ లకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో క్లినిక్ కు రోజుకి కనీసం 200 మంది వస్తున్నట్టు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి ట్రీట్మెంట్ తీసుకొని.. మిగతావారిలో లక్షణాలు కనిపిస్తే అవే మందులు వాడుతున్నట్టు చెబుతున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఒక్కరోజు 969 బృందాలు 65 వేల 777 గృహాలను పరిశీలించాయి. 3 వేల 914 మందికి కిట్లు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా 695 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 1.94 లక్షల గృహాల్లోని 3.65 లక్షల మందిని పరీక్షించారు. 7,030 మందికి కిట్లు అందించారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా లక్షా 35 వేల ఇళ్లను పరిశీలించగా.. లక్షణాలున్న 4,604 మందికి కిట్ల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్  లో 60 వేల గృహాలను పరిశీలించగా.. 1,458 మందిలో లక్షణాలు బయటపడ్డాయి. వరంగల్  జిల్లాలో 29,540 ఇళ్లను పరిశీలించగా.. 1,699 మందికి, హనుమకొండలో 22 వేల 375 ఇళ్లను విజిట్ చేస్తే.. 3 వేల 3 వందల 56 మందికి కొవిడ్  లక్షణాలు కనిపించాయని హెల్త్ సిబ్బంది తెలిపారు.

For More News..

మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ