ఢిల్లీలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు. ఢిల్లీలోని సర్ గాంగారామ్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. మరో 60 మంది పేషెంట్లు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో ఈ ఘటన జరిగింది. తమ దగ్గర రెండు గంటలకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉందని.. వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయకపోతే మిగతా 60మంది ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతాయని ఆస్పత్రి వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాగా.. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమంటే.. తమ హాస్పిటల్‌లో ఆక్సిజన్ కేవలం 5 గంటలకు మాత్రమే సరిపోతుందని ఆస్పత్రి వర్గాలు ముందుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి. అయినా ప్రభుత్వం త్వరితగతిన స్పందించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. నాసిక్ ఘటన మరవక ముందే ఈ ఘటన జరగడంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో గురువారం సాయంత్రానికి 26,169 కొత్త కేసులు నమోదుకాగా.. 306 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.