వ్యవసాయ, సాగునీటి అభివృద్ధి పనులపై అధ్యయనం

వ్యవసాయ, సాగునీటి అభివృద్ధి పనులపై అధ్యయనం

రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగాల అభివృద్ధి పనులను  పరిశీలించేందుకు 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వారు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు.  ఈ పర్యటనలో గుర్తించే ప్రగతికారక అంశాలను అమలు చేయాలని తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామన్నారు. 

ఈసందర్భంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్ మాట్లాడుతూ ... సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10 వేల  ‘రైతుబంధు’ సాయం, రూ.5 లక్షల ‘రైతు బీమా’ సాయం అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, కర్ణాటక తదితర 25 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు.

రైతు సంఘం నాయకుడికి గాయాలు..

25 రాష్ట్రాల రైతుల బృందం సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్  జలాశయాన్ని సందర్శించింది.  రైతుసంఘాల సభ్యుల ముందు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించి, పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేశారు. నీరు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి పడడంతో బెంగాల్ కు చెందిన రైతు సంఘం నాయకుడు ఒకరికి తీవ్ర  గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.