సూర్యాపేట/కోదాడ, వెలుగు: కోదాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న రెండు లిఫ్ట్‌ల ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం కోదాడ పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలో రూ. 47. 64 కోట్లతో చేపట్టనున్న లిఫ్ట్, రూ.5. 30 కోట్లతో ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల్లో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మిస్తామని మాటిచ్చారు. ఇందుకోసం స్థలాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని లిఫ్ట్‌లను బాగు చేస్తామని, నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్‌రావు, ఇరిగేషన్ సీఈ రమేశ్ బాబు, ఈఈ ప్రేమ్చంద్, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, నేతలు లక్ష్మినారాయణ రెడ్డి, పాండురంగ రావు,
యెర్నేని బాబు, రామారావు, సీతయ్య, లక్ష్మణ రావు, అప్పారావు పాల్గొన్నారు.