- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్...
- ‘భక్తరామదాసు’తో తిరుమలాయపాలెం సస్యశ్యామలం.. ఎంపీ నామా
ఖమ్మం రూరల్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 7,770 మెగావాట్స్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరిగేదని, నేడు 18 వేల మెగావాట్స్ కు చేరుకుందని త్వరలో 25 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి అజయ్ కుమార్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు.
పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం రాకముందు తాగు, సాగు నీటికి తిరుమలాయపాలెం మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో భక్త రామదాసు ప్రాజెక్ట్ వల్ల సాగునీరు, మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. కరెంట్ లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు సుభిక్షంగా మారిందని, ఆంధ్రా ప్రాంతానికి పోటీగా పంటలు పండించే స్థాయికి చేరుకుందన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. సీతారామ కెనాల్ కోసం టన్నెల్ ఏర్పాటు చేసి 600 ఎకరాలు నష్టపోకుండా చేశామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ, స్థానికి నాయకులు పాల్గొన్నారు.