కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ జిల్లాలో 25వేల మంది ఓటర్లు కొత్తగా నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 651లొకేషన్లలో 1,338 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని 80ఏళ్లు పైబడిన 644మందికి, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న 373 మందితో పాటు కొవిడ్ బాధితుల కోసం హోమ్ఓటింగ్ సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు. 178 మందికి పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం పొలిటికల్ లీడర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల లీడర్లు ప్రచారానికి ముందస్తు అనుమతిని పొందాలన్నారు.
మల్యాల, వెలుగు: లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీని పరిశీలించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉన్నందున 28 లోగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు స్లిప్‌ల పంపిణీపై ప్రత్యేక దృష్టి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: జిల్లాలో ఓటర్ చిట్టీల పంపిణీపై దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని తహశీల్దార్లతో పోలింగ్ కేంద్రాల్లో వసతులు, ఓటరు స్లిప్ ల పంపిణీ, హోమ్ ఓటింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.