
- సూర్యాపేట జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జిమెంట్
మోతె(మునగాల), వెలుగు: చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్ష, 20 వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.శ్యామ్ శ్రీ మంగళవారం తీర్పు ఇచ్చారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మే లో ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం కాకరవాయిలో తమ బంధువు చనిపోతే సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లింది.
ఆ గ్రామానికి చెందిన ఆమె బంధువైన నల్లగట్టు లక్ష్మయ్య(42) పాపను ఆడిస్తానని తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తీసుకొచ్చి పాపను అప్పగించాడు. రెండు రోజుల తర్వాత చిన్నారి వాంతులు చేసుకోవడం, ఆహారం సరిగా తినకపోవడంతో పాటు కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించినా తగ్గలేదు. దీంతో మహిళ తన కూతురిని ఏం జరిగిందని అడగడంతో జరిగిన విషయం చెప్పింది.
దీంతో మోతె పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. అప్పటి సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి. వీర రాఘవులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం నిందితుడు లక్ష్మయ్య కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ .. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.