హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనుల కోసం టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.250 కోట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే చేస్తున్న పనులకు అదనంగా.. ఈ మొత్తంతో వరదల నుంచి వరంగల్ ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపడుతామని చెప్పారు. శనివారం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జీడబ్ల్యూఎంసీలో కొనసాగుతున్న పనులు, చేపట్టాల్సిన ఇతర కార్యక్రమాలపై రివ్యూ చేశారు.
రూ.250 కోట్లతో నగర ప్రజలకు తక్షణమే ఉపశమనం కలిగించే కీలకమైన పనులు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో భారీ వరదలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలపై ఆక్రమణలు వెంటనే తొలగించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడికి అధికారులు తలొగ్గొద్దని ఆదేశించారు. కబ్జాలు తొలగించే విషయంలో పేదలు ఉంటే ఒప్పించాలని సూచించారు.
కాళోజీ ఆడిటోరియం పను లు వేగంగా పూర్తి చేయాలని, ఎక్కువ మంది కార్మికులను పెట్టి మూడు షిఫ్టుల్లో పనులు చేయించాలని సూచించారు. సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్బండ ప్రకాశ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మేయర్గుండు సుధారాణి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.