తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ ఉద్యోగుల అరెస్ట్.. ఎందుకంటే..?

తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ ఉద్యోగుల అరెస్ట్.. ఎందుకంటే..?

చెన్నై: తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ కంపెనీ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా ప్రైవేట్ స్థలంలో నిరసన తెలిపినందుకుగానూ దాదాపు 250 మంది కార్మికులను కాంచీపురం పోలీసులు ఇవాళ (2024, అక్టోబర్ 9) అదుపులోకి తీసుకున్నారు. కాగా,  ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్‎ కంపెనీకి తమిళనాడులో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, గత నెల రోజులుగా ఇక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

తమను యూనియన్‌‎గా గుర్తించడంతో పాటు వేతన సవరణ, ఎనిమిది గంటల పని, ఇతర ప్రయోజనాలను కోరుతూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులతో కంపెనీ చర్చలు జరిపి కొన్ని డిమాండ్లకు అంగీకరించింది. ఐదు వేల ఇంక్రిమెంట్‌, కార్మికులకు ఉచిత బస్ ఫెసిలిటి వంటి డిమాండ్లకు కంపెనీ ఒకే చెప్పింది. కార్మికుడు మరణించినప్పుడు బాధిత కుటుంబాలకు రూ.లక్ష తక్షణ సహాయంతో పాటు ఇతర డిమాండ్లపై చర్చించడానికి సైతం అంగీకరించింది. 

అయితే, కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన యూనియన్ గుర్తింపుకు మాత్రం శాంసంగ్ కంపెనీ ససేమిరా అంది. యూనియన్‎గా గుర్తించడానికి కంపెనీ నిరాకరించడంతో కార్మికులు ఆందోళనను విరమించకుండా అలాగే కంటిన్యూ చేశారు.  తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆందోళన విరమించుకోవాలని కార్మికులకు సూచించారు. శాంసంగ్ వర్కర్స్ యూనియన్‌ను గుర్తించే విషయంలో రాష్ట్ర కార్మిక శాఖ కోర్టు ఆదేశాలను అమలు చేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గలేదు. కార్మికుల ఆందోళనతో శాంసంగ్ యూనిట్ వద్ద ఉద్రిక్త నెలకొంది. 

ALSO READ | Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసన చేస్తోన్న దాదాపు 250 మంది కార్మికులను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ స్థలంలో అనుమతి లేకుండా ఆందోళనకు దిగారన్న ఆరోపణల మేరకు పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిరసన తెలిపేందుకు భూ యజమాని నుంచి అనుమతి ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. అరెస్ట్‎ను సవాల్ చేస్తూ ఆందోళనకారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై రేపు (అక్టోబర్ 10) విచారణ చేపట్టనుంది. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేస్తారా లేదా..? లేక జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.