
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లులు వసూలు చేసే క్రమంలో దొంగనోట్లు వచ్చాయని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో విద్యుత్ అధికారులు బకాయిలు వసూలు చేస్తున్నారు.
సోమవారం వరకు వచ్చిన రూ.7.12 లక్షలను ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా అందులో రెండు రూ.500 దొంగనోట్లను గుర్తించారు. విద్యుత్ ఆఫీసర్లు మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంతాల్లో బిల్లులు వసూలు చేశామని, అందులో ఎవరి నుంచి వచ్చాయో కనిపెట్టలేకపోతున్నామన్నారు. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ ఆర్బీఐ రూల్స్ ప్రకారం దొంగనోట్లను చింపి పడేశామని తెలిపారు. ఒకేసారి10 ఫేక్ నోట్లు వస్తేనే కేసు నమోదుకు సిఫారసు చేస్తామని మేనేజర్ చెప్పారు. కాగా మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ములుగులో దొంగనోట్ల విషయం కలకలం రేపుతోంది.