తెలంగాణలో కొత్త‌గా 253 క‌రోనా కేసులు.. 180 దాటిన మ‌ర‌ణాలు

తెలంగాణలో కొత్త‌గా 253 క‌రోనా కేసులు.. 180 దాటిన మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 253 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. ఎనిమిది మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై శ‌నివారం రాత్రి 9 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. రాష్ట్రంలో శుక్ర‌‌వారం సాయం‌త్రం ఐదు గంట‌ల నుంచి శ‌ని‌వారం సాయంత్రం ఐదు గంట‌ల మ‌ధ్య న‌మోదైన కేసులు, మ‌ర‌ణాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌డిచిన‌ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 253 కేసులు న‌మోదు కాగా..ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4737కు చేరింది. ఎనిమిది మ‌ర‌ణించ‌గా.. రాష్ట్రంలో క‌రోనా మృతుల సంఖ్య 182కు పెరిగింది. అలాగే ఇవాళ 74 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య‌ 2352కు చేరింది. ప్ర‌స్తుతం 2203 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల్లో 449 మంది విదేశాల నుంచి వ‌చ్చిన వారు, వ‌ల‌స కార్మికులు ఉన్నార‌ని రాష్ట్ర‌ ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ‌కు చెందిన లోక‌ల్స్ 4288 మంది క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది.

గ‌డిచిన 24 గంటల్లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 179 మంది ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చ‌ల్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో 11, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 4 కేసులు న‌మోద‌య్యాయి. వ‌రంగ‌ల్ రూర‌ల్, వ‌రంగ‌ల్ అర్బ‌న్, క‌రీంన‌గ‌ర్, న‌ల్ల‌గొండ‌, ములుగు, సిరిసిల్ల‌, మంచిర్యాల జిల్లాల్లో 2 చొప్పున క‌రోనా పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. సిద్దిపేట‌, ఖ‌మ్మం, మెద‌క్, నిజామాబాద్, నాగ‌ర్ క‌ర్నూల్, కామారెడ్డి, జిగిత్యాల జిల్లాల్లో ఒక్కొక్క క‌ర‌నా కేసు న‌మోదైన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.