- టాప్ 50 టూరిస్ట్ డెస్టినేషన్ల అభివృద్ధికి కేంద్రం నిర్ణయం
న్యూ ఢిల్లీ: పర్యాటక రంగంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలోని టాప్50 టూరిస్ట్ డెస్టినేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్రాల సహకారంతో చాలెంజ్ మోడ్‌లో డెవలప్ చేస్తామని ప్రకటించారు. పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. భారీ ఎత్తున హోటళ్లుఏర్పాటు చేయిస్తామని చెప్పారు. వీటితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని, స్కిల్ కూడా డెవలప్ చేస్తామని తెలిపారు. ముద్ర రుణాలు ఇచ్చి.. పర్యాటక రంగానికి అనుకూలంగా ఉండే అన్ని కార్యక్రమాలూ చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇచ్చి.. పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా చూస్తామని వెల్లడించారు. ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన పర్యాటక బృందాలకు ఈ వీసా సౌకర్యంతోపాటు వీసా ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్టు చెప్పారు.
‘హీల్ ఇండియా’ ఇనీషియేటివ్ కింద పీపీపీ విధానంలో మెడికల్ టూరిజం అభివృద్ధి చేస్తామని, ఇందుకు వీసా నిబంధనలను సడలిస్తామని తెలిపారు. బడ్జెట్లో పర్యాటక మంత్రిత్వ శాఖకు రూ.2,541.06 కోట్లు కేటాయించారు. ఈ సారి కేటాయింపులు నిరుడి(850.36 కోట్ల) కంటే గణనీయంగా పెంచారు. ఎక్కువ భాగం పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించగా.. స్వదేశ్ దర్శన్ పథకం కింద టూరిజం సర్క్యూట్‌ల ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కోసం రూ.1,900 కోట్లు ఇచ్చారు. యాత్రాస్థలాల గుర్తింపు, పునరుజ్జీవనానికి సంబంధించిన ప్రసాద్ స్కీమ్‌కు కూడా భారీగానే కేటాయింపులు చేశారు. పర్యాటక రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.60 కోట్లు కేటాయించారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ), కుమరకోమ్ ఫ్రంటియర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో వరుసగా రూ. 70.42 కోట్లు, రూ. 10 కోట్ల కేటాయింపులు చేశారు.