తేజ రకం మిర్చి క్వింటాల్​ రూ.25,550

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో తేజ రకం కొత్త మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్‌‌ మిర్చిని రూ.25,550 పెట్టి కొన్నారు. ఖమ్మం మార్కెట్​చరిత్రలో తేజ రకానికి ఇదే హయ్యస్ట్​రేటు అని అధికారులు తెలిపారు. సోమవారం మొత్తం 20 వేల బస్తాల మిర్చి రాగా, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​పాల్గొని జెండా పాటను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉలవనూర్ గ్రామానికి చెందిన అచ్చ శ్రీను అనే రైతు 40 క్వింటాళ్ల తేజ రకం కొత్త పంటను మార్కెట్​కు తీసుకువచ్చాడు. క్వింటాల్​రూ.25,550 పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మంత్రి అజయ్​మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్​ను అంతర్జాతీయంగా చిల్లీస్ హబ్​గా చేస్తామని, బీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని అన్నారు. జెండా పాటలో అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్, ఏఎంసీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.