చదువుకున్నోళ్లకు ఓటెయ్య రాలే.. బ్యాలెట్​ పేపర్లపై చిత్ర, విచిత్ర రాతలు

  • గ్రాడ్యుయేట్​ బైపోల్​లో  25,877 ఓట్లు చెల్లలే
  • మొదటి ప్రయారిటీ ఓట్లపై తీవ్ర ప్రభావం
  • బ్యాలెట్​ పేపర్లపై చిత్ర, విచిత్ర రాతలు
  • రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన పరిస్థితి

నల్గొండ, వెలుగు:  వాళ్లంతా డిగ్రీ, పీజీ చదువుకున్న వాళ్లు. కానీ, గ్రాడ్యుయేట్​ ఉప ఎన్నికలో ఓటు వేయడంలో ఫెయిల్​ అయ్యారు. ఎన్నికల అధికారులు అనేక రకాలుగా అవగాహన కల్పించినా, మీడియా ద్వారా ప్రచారం చేసినా పట్టభద్రులు సరిగా ఓటువేయలేకపోయారు. దీంతో ఇటీవల జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏకంగా 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధాన అభ్యర్థులతో సమానంగా చెల్లని ఓట్లే  ఐదో స్థానంలో ఉన్నాయి. ఫలితంగా ప్రధాన అభ్యర్థులకు ఫస్ట్​ ప్రయారిటీ ఓట్ల ద్వారా గెలుపు అవకాశాలు దూరమయ్యాయి.

అంచనాలు తారుమారు.. 

నల్గొండ, ఖమ్మం, వరంగల్​ గ్రాడ్యుయేట్  ఉప ఎన్నికలో భారీగా పోలైన చెల్లని ఓట్లు అధికారులకు చుక్కలు చూపించాయి. చదవుకున్నోళ్లకు ఓటు  వేయరాకపోవడం ఒక వింత కాగా, ఇంకొందరు బ్యాలట్​ పేపర్ల మీద విచిత్రమైన రాతలు రాసి తమ అజ్ఞానాన్ని చాటుకున్నారు. పోలైన ఓట్లలో చెల్లే ఓట్లను, చెల్లని ఓట్లను వేరు చేసేందుకే కౌంటింగ్​ సిబ్బందికి ఎక్కువ టైం పడుతోంది. 52 మంది అభ్యర్థులు  బరిలో ఉండడంతో జంబో బ్యాలట్​ వాడాల్సి వచ్చింది. ఒక్కో బ్యాలట్​ను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి వస్తోంది.  మొత్తం3,36,013 ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఏకంగా  25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రధాన అభ్యర్థులైన ప్రేమేందర్​ రెడ్డి, అశోక్​ కుమార్​కు వచ్చిన ఓట్లతో సమానంగా చెల్లని ఓట్లు బయట పడటం అధికారులను విస్మయానికి గురిచేసింది. నాలుగు రౌండ్లలో కలిపి కాంగ్రెస్  అభ్యర్థి తీన్మార్​ మల్లన్నకు వచ్చిన మెజారిటీ 18,565 ఓట్లు ఉండగా, అంతకంటే ఎక్కువ సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండడంతో ప్రధాన అభ్యర్థులకు మొదటి ప్రయారిటీ ఓట్ల ద్వారా విజయావకాశాలు దూరమయ్యాయి. 

బ్యాలట్​ పేపర్​పై పిచ్చి రాతలు

బ్యాలట్  పేపర్ల మీద గ్రాడ్యుయేట్లు ఇష్టం వచ్చినట్లు పిచ్చి రాతలు రాశారు. 1, 2, 3.. ఇలా ప్రాధాన్యత క్రమంలో అంకెలను వేయాల్సి ఉండగా, 1 లేకుండా 2, 3, 4 వేస్తూ పోయారు. కొందరైతే అంకెల స్థానంలో క్రాస్​ గుర్తులు, టిక్​ మార్కులు పెట్టారు. పేపర్​ మీద ‘జై మల్లన్న’, ‘జై రాకేశ్​ రెడ్డి’ అని రాశారు. ఇంకొందరు బ్యాలెట్​ పేపర్​ వెనకాల ఫోన్ పే నంబర్లు వేయడంతోపాటు ‘ఐ లవ్​ యూ’ అని రాశారు.  గ్రాడ్యుయేట్లు ఓట్లు ఎలా వేయాలనే అంశంపై అటు ఎన్నికల కమిషన్ తో పాటు, పోటీచేసిన అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. పోలింగ్​ కేంద్రాల వద్ద  ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఓటర్ల అజ్ఞానం వల్ల తాము నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. 

మొదటి ప్రయారిటీలోనే నేను గెలవాల్సింది: తీన్మార్​ మల్లన్న 

చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో పోల్​ కావడం బాధాకరం. ఓటు ఏ విధంగా వేయాలో మా వంతు బాధ్యతగా ఓటర్లకు అవగాహన కల్పించాం. చెల్లని ఓట్లు ఎక్కువగా పోల్  కావడంతో నా గెలుపు అంచనాలు తారుమారయ్యాయి. మొదటి ప్రయారిటీలో నేను గెలవాల్సి  ఉంది. కానీ, చెల్లని ఓట్ల వల్ల సెకండ్​ ప్రయారిటీ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.