ఏపీలో రికార్డుస్థాయిలో క‌రోనా కేసులు.. మూడ్రోజుల్లో 120 మ‌ర‌ణాలు

ఏపీలో రికార్డుస్థాయిలో క‌రోనా కేసులు.. మూడ్రోజుల్లో 120 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కొద్ది రోజులుగా భారీ సంఖ్య‌లో కొత్త కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,593 మందికి కరోనా పాజిటివ్ రాగా, ఈ ఒక్క రోజులో 40 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించార‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. తాజా న‌మోదైన కేసుల్లో 2,584 మంది లోక‌ల్స్ కాగా, 9 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు ఉన్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 38,044కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,453 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 432 మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 19,393 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 18,159 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

500కి చేరువ‌లో మ‌ర‌ణాలు

ఏపీలో కొద్ది రోజులుగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య భారీగా పెరగ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌త మూడ్రోజులుగా ప్ర‌తి రోజూ క‌నీసం 40 మంది వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణ‌స్తున్నారు. మంగ‌ళ‌వారం బులిటెన్‌లో 43, బుధ‌వారం 44 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 40 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయార‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. తూర్పు గోదావ‌రి, ప్ర‌కాశం జిల్లాల్లో 8 మంది చొప్పున, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, క‌డ‌ప జిల్లాలో న‌లుగురు క‌రోనాతో మృతి చెందారు. గుంటూరు, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, క‌ర్నూలు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్క‌రు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 492కి చేరింది. గ‌డిచిన మూడ్రోజుల్లోనే 120 మందికి పైగా మ‌ర‌ణించ‌‌డం ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది.