తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ పోరు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా పోటీ చేద్దామా అని చూస్తున్నారు. అయితే కొన్ని గ్రామాలు ఇప్పటి నుంచే ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. లేటెస్ట్ గా జోగులాంబ గద్వాల జిల్లా మావపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించారు గ్రామస్తులు. వేలం పాటలో బి భీమరాజు అనే వ్యక్తి సర్పంచ్ పదవిని 27 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. వేలం పాటలో నలుగురు గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే వేలం పాటను ధ్రువీకరించిన గ్రామస్తులు..ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా చూస్తున్నారు .
ఎవరూ పోటీలో లేకుంటే నోటా ఉంటది..!
అయితే పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు స్టేట్ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రతిపాదనలను రెడీ చేస్తున్నది. ‘రైట్ నాట్ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాను ఎంచుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల ఈ అవకాశం లేకుండా పోతున్నది. దీనిపై పబ్లిక్ నుంచి ఈసీకి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఫోరం ఫర్గుడ్గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎఫ్జీజీ కోరింది. అందుకే ఒక్క నామినేషన్వచ్చినా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్మాత్రమే మిగిలినా.. ఏకగ్రీవానికి తావులేకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా ఉంచి, ఓటింగ్ పెట్టాలని ఈసీ భావిస్తున్నది. దీనిపై ఈ నెల 12న అన్ని రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి.