- 52 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో వెయ్యి ఓట్లు దాటింది ఆరుగురికే
నల్గొండ, వెలుగు: నల్గొండ-–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఓట్ల లెక్కింపు సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతున్నందున అభ్యర్థుల ఓట్ల లెక్కింపు సులువుగా అయిపోతుంది. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం.. ఓట్లను లెక్కించడం భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయడం వల్ల జంబో బ్యాలెట్ వాడాల్సి వచ్చింది. అయితే 26 మంది అభ్యర్థులకు 10 నుంచి 87 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరో 20 మందికి 100 నుంచి 812 ఓట్లు పోలయ్యాయి. ఆరుగురికి మాత్రమే వెయ్యికి పైగా ఓట్లు రావడం గమనార్హం. 48 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లు మొత్తం కలిపితే పది వేలు కూడా దాటలేదు. ఈ ఓట్లు లెక్కించడానికి ఒకటిన్నర రోజు పట్టింది.
3 రోజులు.. రేయింబవళ్లు కౌంటింగ్..
మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు గురువారం రాత్రికి అయిపోయింది. ఎలిమినేషన్ ప్రాసెస్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి పొద్దు పోయే వరకు కొనసాగింది. 48 మంది అభ్యర్థుల ఓట్లను లెక్కించడానికి 24 గంటల సమయం పట్టింది. కౌంటింగ్ చాలా ఆలస్యమవుతుండడంతో అధికారులు ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని కౌంటింగ్ హాల్స్ ను పెంచాల్సి వచ్చింది. మొదటి రౌండ్ల లెక్కింపు ఒకటే హాల్లో చేశారు. కానీ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ఎలిమినేషన్ ప్రాసెస్ త్వరగా ముగించేందుకు ప్రత్యేకంగా నాలుగు హాల్స్‌లో ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. తక్కువ వచ్చిన ఓట్లను ఆర్వో టేబుల్స్ మీద లెక్కిస్తే, ఎక్కువ వచ్చిన ఓట్లను ఒకటే హాల్లో లెక్కించారు.