
- 25 లక్షల మంది హెల్త్ చెకప్‌లను పరిశీలించిన అపోలో హాస్పిటల్స్
- 26 శాతం మందికి హైబీపీ, 23 శాతం మందికి డయాబెటిస్
- 66 శాతం మందికి లివర్ కొలెస్ట్రాల్
- ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025’ నివేదికలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలో 26 శాతం మండుతున్నారని, 66 శాతం మందికి లివర్ కొలెస్ట్రాల్ సమస్య ఉందని అపోలో హాస్పిటల్స్ స్టడి తేల్చింది. హైబీపీతో, 23 శాతం మంది షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025’ పేరిట అపోలో హాస్పిటల్స్ ఐదో ఎడిషన్ ను సోమవారం రిలీజ్ చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వెల్లడించింది. ‘లక్షణాల కోసం ఎదురు చూడకండి.. ముందస్తు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి’ అనే మెసేజ్‌తో ఈ నివేదికను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షించి ఈ నివేదికను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నివేదికలో 26% మంది హైబీపీతో, 23% మంది షుగర్ తో బాధపడుతున్నట్లు తేలింది.
అయితే వారికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని నివేదికలో పేర్కొంది. 2019లో 10 లక్షల మంది హెల్త్ చెకప్ చేసుకోగా 2024లో 25 లక్షల మంది హెల్త్ చెకప్ చేసుకున్నారని, హెల్త్ చెకప్ చేసుకున్నవారి సంఖ్య ఐదేళ్లలో దాదాపు 150 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. ఈ నివేదిక మూడు రకాల అత్యవసర ఆరోగ్య సమస్యల మీద దృష్టి సారించింది. లివర్ కొలెస్ట్రాల్ వ్యాధి, మెనోపాజ్ తర్వాత ఆరోగ్య క్షీణత, చిన్నారుల స్థూలకాయంపై రిపోర్ట్ అనే అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఈ సందర్భంగా అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించాలని, ప్రతి ఇల్లు ఆరోగ్య కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. ఈ నివేదిక మన ఆరోగ్య బాధ్యతను తెలియజేస్తున్నదన్నారు. ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేసే అంశాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. కాలేయ సమస్యలపై ఎండీ సునీతా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య పరీక్షలు జరిపిన వారిలో 66 శాతం మందికి లివర్ కొలెస్ట్రాల్ సమస్యలు ఉండగా.. వారిలో 85 శాతం మంది మద్యానికి దూరంగా ఉన్నారని తెలిపారు.