కేజీబీవీలో 26 మంది స్టూడెంట్లకు అస్వస్థత

కేజీబీవీలో 26 మంది  స్టూడెంట్లకు అస్వస్థత
  •     వాంతులు చేసుకోగా పరిగి ఆస్పత్రికి తరలింపు
  •     వైద్యారోగ్య సిబ్బంది ఇచ్చిన మాత్రలతో  ఘటన 
  •     నస్కల్ కస్తూర్భా  విద్యార్థినుల అస్వస్థతపై కలెక్టర్ ఆరా

పరిగి, వెలుగు: వైద్యారోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థినులు అస్వస్థత గురైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ కస్తూర్భా స్కూల్ లో చోటు చేసుకుంది. చిట్యాల పీహెచ్ సీ ఏఎన్ఎం లక్ష్మి  గురువారం మధ్యాహ్నం విద్యార్థినులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. భోజనం చేసిన తర్వాత వాటిని వేసుకున్న విద్యార్థినులు వాంతులు చేసుకోగా పాఠశాల సిబ్బంది ఆందోళన చెంది ప్రిన్సిపల్ సఫియా సుల్తానా బేగంకు సమాచారం అందించారు.  

26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవగా వెంటనే 108లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు. ఘటనపై తెలియడంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఉదయం పరిగి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థినుల అస్వస్థత కారణాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నస్కల్ కస్తూర్భా స్కూల్ లో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి డిప్యూటీ డీఎంహెచ్ ఓ జయరాజు పర్యవేక్షణలో చికిత్స అందజేశారు.   

విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి కారణం స్కూల్ సిబ్బంది  సాయంత్రం స్నాక్స్ గా( ఉడకబెట్టిన శనిగలు) ఇవ్వడంతోపాటు కల్తీ ఫుడ్ అందించడమేనని ఏఎన్ ఎం లక్ష్మి పేర్కొన్నారు.  విద్యార్థినులకు అందించిన ఫుడ్ ను పరీక్ష నిమిత్తం పంపించామని పాఠశాల ప్రిన్సిపల్ సఫియా సుల్తానా బేగం ప్రిన్సిపల్ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని విద్యార్థినుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.