- 85 రోజుల్లో ఇదే హయ్యెస్ట్
- 1.13 కోట్లు దాటిన కేసులు, 1.58 లక్షలు దాటిన డెత్స్
- ఒక్క మహారాష్ట్రలోనే 58 శాతం యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 26,291 కేసులు నమోదయ్యాయి. 85 రోజుల తర్వాత 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే హయ్యెస్ట్. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1 కోటి13 లక్షల 85 వేల 339కి చేరినట్టు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. కరోనాతో మరో 188 మంది మరణించారు. మహారాష్ట్రలో 50, పంజాబ్ లో 20, కేరళలో 15 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 1,58,725కి పెరిగింది. డెత్ రేట్ 1.39 శాతంగా నిలిచింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 52, 861, తమిళనాడులో 12,547, కర్నాటకలో 12,390, ఢిల్లీలో 10,941, వెస్ట్ బెంగాల్ లో 10,292, ఉత్తరప్రదేశ్ లో 8,746, ఆంధ్రప్రదేశ్ లో 7,184 మంది మరణించారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. కోమార్బడిటీస్ కారణంగా 70 శాతం మరణాలు సంభవించినట్టు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అస్సాం, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, లక్షద్వీప్, సిక్కిం, లడఖ్, మణిపూర్, దామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలి, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్లో ఒక్క డెత్ కేసు నమోదు కాలేదని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1 కోటి 10 లక్షల 7 వేల 352 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,19,262కి చేరగా మొత్తం కేసుల్లో ఇది 1.93 శాతంగా నిలిచింది. రికవరీ రేటు 96.68 శాతానికి తగ్గింది. గత ఏడాది డిసెంబర్ 20న ఒక్కరోజే 26,624 కేసులు నమోదయ్యాయి. ఆదివారం వరకు దేశవ్యాప్తంగా 22,74,07,413మందికి టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లోనే 78 శాతం కొత్త కేసులు
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులోనే 78.41% కొత్త కేసులు నమోదైనట్టు హెల్త్ మినిస్ట్రీ సోమవారం పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ లోనే 77% ఉన్నట్టు తెలిపింది. మరోవైపు సోమవారం ఉదయం 7 గంటల నాటికి 2 కోట్ల 99 లక్షల 8 వేల 38 మందికి వ్యాక్సిన్ వేసినట్టు హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.