రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 26 వేల మంది ఇంటికి

రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 26 వేల మంది ఇంటికి
  • కిందటి ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగ కోతలు
  • టెంపరరీ, పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించుకుంటున్న  కంపెనీలు
  • సేల్స్ , డిమాండ్ పడిపోవడమే కారణం
  • మూతపడుతున్న స్టోర్లు.. ఆగిన బిజినెస్‌‌‌‌‌‌‌‌  విస్తరణ 

న్యూఢిల్లీ: రిలయన్స్, టైటాన్‌‌‌‌‌‌‌‌,  రేమండ్ వంటి రిటైల్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేశాయి.  కిందటి ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రిటైల్ కంపెనీలు సుమారు 26 వేల మందిని ఇంటికి పంపించేశాయని  అంచనా. దీంతో  రిటైల్ ఇండస్ట్రీలో ఉద్యోగుల సంఖ్య 4,55,000 నుంచి 4,29,000 కు తగ్గింది. ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో  లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌, గ్రోసరీ, క్విక్‌‌‌‌‌‌‌‌కామర్స్  సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లకు చెందిన 12 లిస్టెడ్ కంపెనీలు  ఉన్నాయి. 

అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇవి భారీగా నియామకాలు చేపట్టాయని, కానీ డిమాండ్ పడిపోవడంతో తాజాగా ఉద్యోగులను తీసేస్తున్నాయని ఎకనామిక్‌‌‌‌‌‌‌‌ టైమ్స్ రిపోర్ట్ చేసింది.   కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా కలుపుకుంటే ఉద్యోగుల కోత ఇంకా ఎక్కువగా ఉంది. రిలయన్స్ రిటైల్‌‌‌‌‌‌‌‌, టైటాన్‌‌‌‌‌‌‌‌, రేమండ్‌‌‌‌‌‌‌‌, పేజ్‌‌‌‌‌‌‌‌, స్పెన్సర్స్‌‌‌‌‌‌‌‌  కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా కలుపుకొని మొత్తం 52 వేల మంది ఉద్యోగులను 2023–24 లో తొలగించాయి.  వీటి మొత్తం వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో  ఇది 17 శాతానికి సమానం. 

పడిన డిమాండ్

దుస్తులు, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ వంటి నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై వినియోగదారులు చేసే ఖర్చులు తగ్గాయి. ఫలితంగా 2022 దీపావళి తర్వాత  రిటైలర్ల సేల్స్  గ్రోత్‌‌‌‌‌‌‌‌ 4 శాతానికి పడిపోయింది.  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరగడం,  వడ్డీ రేట్లు ఎక్కువవ్వడం,  ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల కోత వంటివి వినియోగదారుల ఖర్చులు తగ్గడానికి కారణమయ్యాయి.  సేల్స్ పెరగకపోవడంతో   రిటైల్ కంపెనీలు తమ స్టోర్లను విస్తరించడానికి ఒకటికిరెండుసార్లు ఆలోచిస్తున్నాయి.  కంపెనీల స్టోర్ల విస్తరణ గత ఐదేళ్లలో  తక్కువైన 9 శాతం రేటుతో కొనసాగుతోంది. ఫలితంగా టాప్ ఎనిమిది సిటీల్లో 2023 లో  71 లక్షల చదరపు అడుగు స్పేస్ తీసుకున్న రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈ ఏడాది 60–65 లక్షల చదరపు అడుగుల స్పేస్ తీసుకుంటుందని సీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ అంచనా వేస్తోంది.  మరోవైపు ట్యాలెంట్ కొరత ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజగోపాలన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇండస్ట్రీ మరింత మందిని హైర్ చేసుకోవడానికి యూనివర్సిటీలతో టై అప్ అయ్యిందని పేర్కొన్నారు. బిజినెస్‌‌‌‌‌‌‌‌లను క్లోజ్ చేయడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఉండొచ్చని  అన్నారు. కానీ,  షాపర్స్‌‌‌‌‌‌‌‌ స్టాప్‌‌‌‌‌‌‌‌, ట్రెంట్ వంటి కంపెనీలు తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తున్నాయని, వీటికి భారీగా  స్టాఫ్ అవసరమవుతారని వివరించారు.  

కరోనా సంక్షోభం తర్వాత వినియోగదారుల ఖర్చులు పెరిగాయని,  ఫలితంగా రిటైల్ కంపెనీలు కూడా తమ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను, ఫ్లోర్ స్పేస్‌‌‌‌‌‌‌‌ను పెంచాయని  రిటైల్‌‌‌‌‌‌‌‌ కన్సల్టింగ్ కంపెనీ థర్డ్‌‌‌‌‌‌‌‌ ఐసైట్‌‌‌‌‌‌‌‌ దేవంగ్షు దత్తా అన్నారు. కానీ, వీటిలో కొన్ని స్టోర్లు లాభదాయకం కాకపోతే  కంపెనీలు వీటిని క్లోజ్ చేస్తున్నాయని, ఉద్యోగులను తీసేస్తున్నాయని చెప్పారు. మరోవైపు ట్యాలెంట్ ఉన్నవారిని నిలుపుకోవడానికి కూడా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్యాలెంట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కీలకమని  అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ నెవెల్లీ నోరొన్హ అన్నారు.  ‘రానున్న పదేళ్లలో నిలకడైన వృద్ధి చెందాలంటే   మనకు ఇకముందు ఎటువంటి ట్యాలెంట్‌‌‌‌‌‌‌‌ అవసరమో ఆలోచించాలి’ అని షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్లను ఉద్దేశిస్తూ ఆయన గతంలో పేర్కొన్నారు.