సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో .. 260 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో  ..  260 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్​, వెలుగు: ఎలాంటి రసీదులు లేకుండా రైలులో బంగారు ఆభరణాలు తరలిస్తుండగా  ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.18.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఇన్​కమ్ ​ట్యాక్స్​ అధికారులకు అందజేశారు. రైల్వే ఇన్​స్పెక్టర్​సాయి ఈశ్వర్​గౌడ్​ తెలిపిన మేరకు.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో బుధవారం ఉదయం 5.30గంటలకు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

ప్లాట్​ఫామ్. -2  మిడిల్​ఫుట్​ఓవర్​ బ్రిడ్జిపైన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండ గా.. పోలీసులు వెళ్లి అతని బ్యాగును చెక్​చేశారు. అందులో 260 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. ఆభరణాలు ఎక్కడ నుంచి తెచ్చారు..? ఎక్కడకు తీసుకువెళుతున్నారు..? వాటికి సంబంధించిన ఆధారాలు చూపాలని వ్యక్తిని కోరగా ఎలాంటి ఆధారాలు చూపలేదు. 

దీంతో అతడి వివరాలు తెలుసుకోగా.. చార్మినార్​సమీపంలోని చార్​ కమాన్​చెలాపురాకు చెందిన  గోల్డ్​స్మిత్​ కౌశిక్​సంత్ర(30)గా చెప్పాడు. ఆభరణాలను సికింద్రాబాద్​నుంచి లింగంపల్లి ద్వారా -విజయవాడ వెళ్లే ఇంటర్​సిటీ రైలులో గుంటూరుకు తీసుకెళ్తున్నట్టు తెలిపాడు. నగలకు సంబంధించిన కొనుగోలు రసీదులు లేకపోవడంతో ఇన్​కమ్​ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్టు  రైల్వే ఇన్ స్పెక్టర్ తెలిపారు.