రాణాకు 33 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నయ్..ఇండియాకు అప్పగించొద్దు.. రాణా లాయర్ విజ్ఞప్తి 

రాణాకు 33 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నయ్..ఇండియాకు అప్పగించొద్దు.. రాణా లాయర్ విజ్ఞప్తి 
  • ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారమే అప్పగిస్తున్నామన్న అమెరికా

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం తనను ఇండియాకు అప్పగించకుండా ఉండేందుకు ముంబై ఉగ్రదాడి కుట్రదారు, పాకిస్తాన్ కెనడియన్ టెర్రరిస్ట్ తహవుర్ రాణా చివరి వరకూ అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా వెల్లడైంది. రాణాకు 33 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఇండియాకు అప్పగించవద్దంటూ ఎక్స్ ట్రాడిషన్ కు ముందు అమెరికా ప్రభుత్వానికి అతడి లాయర్ విజ్ఞప్తి చేశాడు. ఇండియన్ జైలులో అతడిని చిత్రహింసలు పెట్టవచ్చని, ఆరోగ్యం క్షీణించి అతడు చనిపోయే ప్రమాదం కూడా ఉందని వాదించాడు.

అయితే, ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారమే రాణాను ఇండియాకు ఎక్స్ ట్రాడిషన్ చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. రాణా ఎక్స్ ట్రాడిషన్ ను తప్పించేందుకు అతడి లాయర్ జాన్ డి. క్లైన్ చివరి ప్రయత్నంగా ఈ ఏడాది జనవరి 21న అమెరికా విదేశాంగ శాఖకు లేఖ రాసినట్టుగా వెల్లడైంది. అయితే, ఈ విజ్ఞప్తిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆఫీస్ తిరస్కరిస్తూ.. ఫిబ్రవరి 11న రిప్లై ఇచ్చింది. ఇంటర్నేషనల్ రూల్స్ 
ప్రకారమే రాణాను అప్పగిస్తున్నామని స్పష్టం చేసింది.

ఖురాన్ పఠనం.. ఐదుసార్లు నమాజ్ 

ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్​లో అత్యంత పటిష్టమైన భద్రత మధ్య సెల్​లో ఉన్న తహవుర్ రాణా ఖురాన్, పెన్ను, పేపర్ అడగగా తాము ఇచ్చామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. రాణా రోజూ ఖురాన్ చదువుతూ, ఐదు సార్లు నమాజ్ చేస్తున్నాడని తెలిపారు. అతడిపై 24 గంటలూ నిఘా పెట్టామన్నారు. కాగా, 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో కుట్రదారుగా ఉన్న రాణాను అమెరికా నుంచి గురువారం సాయంత్రం ఎన్ఐఏ టీమ్ తీసుకురాగా, కోర్టు శుక్రవారం నుంచి 18 రోజుల కస్టడీకి అప్పగించింది.

అప్పటి నుంచి ఎన్ఐఏ అధికారులు రోజూ అతడిని విచారిస్తున్నారు. ఉగ్రదాడికి కొన్ని రోజులకు ముందు అతడు కొచ్చిన్, తదితర ప్రాంతాల్లో పర్యటించాడని గుర్తించారు. అక్కడ రాణాకు సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.