
- 26/11 ఉగ్రదాడి సూత్రధారిని అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చిన ఆఫీసర్లు
- ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అరెస్ట్
- హై సెక్యూరిటీతో ఎన్ఐఏ సెల్‌కు తహవుర్
న్యూఢిల్లీ: ముంబై టెర్రర్ అటాక్ (26/11) కేసులో ప్రధాన సూత్రధారి, పాకిస్తాన్ కెనడియన్ టెర్రరిస్ట్ తహవుర్ రాణా(64)ను ఎన్ఐఏ అధికారులు ఇండియాకు తీసుకొచ్చారు. అమెరికాలోని జైలులో ఉన్న రాణాను స్థానిక కోర్టు ఆదేశాల మేరకు అక్కడి అధికారులు బుధవారం ఇండియాకు అప్పగించారు. అతడిని కస్టడీలోకి తీసుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు స్పెషల్ ఫ్లైట్ లో గురువారం సాయంత్రం ఢిల్లీకి తీసుకువచ్చారు. అనంతరం ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అతడిని ఎన్ఐఏ కస్టడీకి తీసుకుంది. కాగా, అమెరికా నుంచి తహవుర్ రాణా ఎక్స్ ట్రాడిషన్ విజయవంతంగా పూర్తయిందని అంతకుముందు ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘తహవుర్ రాణాను తీసుకొచ్చేందుకు ఏండ్ల తరబడి ప్రయత్నాలు చేశాం. అమెరికా, మన దేశానికి చెందిన వివిధ సంస్థల సహకారంతో అది సాధ్యమైంది” అని తెలిపింది.
విచారణకు హై సెక్యూరిటీ సెల్ సిద్ధం..
తహవుర్ రాణాను విచారించేందుకు అధికారులు ఇప్పటికే ఒక స్పెషల్ హై సెక్యూరిటీ ఇంటరాగేషన్ సెల్‌ను ఏర్పాటు చేశారు. దర్యాప్తుకు సంబంధించిన 12 మందితో కూడిన స్పెషల్ టీమ్ కు మాత్రమే ఈ సెల్‌లోకి ప్రవేశం ఉంటుంది. వీరిలో డీజీ ఎన్ఐఏ సదానంద్ దాతే, ఐజీ ఆశిశ్ బాత్రా, డీఐజీ జయ రాయ్ ఉన్నారు. 12 మందితో కూడిన టీమ్ కాకుండా ఇంకెవరైనా ఇంటరాగేషన్ సెల్‌లోకి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. విచారణ సమయంలో 26/11 ముంబై దాడులకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు తహవుర్ కు చూపిస్తారు. వాయిస్ రికార్డులు, ఫొటోలు, వీడియోలు, ఈ–మెయిల్స్ చూపించి ప్రశ్నలు వేస్తారు. విచారణతో పాకిస్తాన్- అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో, పాకిస్తాన్ ఆర్మీ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐస్ఐ)తో రాణా సంబంధాలను అధికారులు రాబట్టనున్నారు.
ఫస్ట్ ఇంటారాగేట్ చేసేది ఈయనే..
హై సెక్యూరిటీ ఇంటరాగేషన్ సెల్‌లో రాణాను మొదట ఎన్ఐఏ చీఫ్ సదానంద్ వసంత్ దాతే విచారించనున్నారు. 26/11 ముంబై దాడుల సమయంలో అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ సహా ఇతర టెర్రరిస్టులతో సదానంద్ వసంత్ దాతే శక్తికి మించి పోరాడారు. భద్రతా సిబ్బంది అంతా గాయపడటంతో.. సదానంద్ ఒక్కడే ఒంటరిగా 40 నిమిషాలకు పైగా టెర్రరిస్టులతో పోరాడారు. టెర్రరిస్టులు గ్రనేడ్ విసిరడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. యుద్ధంలాంటి పరిస్థితిలో సదానంద్ చూపిన ధైర్యం..ట్రెర్రరిస్టుల నుంచి చాలా మంది అమాయకులను కాపాడింది. దాడి సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న సదానంద్ వసంత్ దాతే ఇప్పుడు ఎన్ఐఏ చీఫ్ హోదాలో తహవుర్ రాణాను ఇంటారాగేట్ చేయనున్నారు.
క్రెడిట్ మాదంటే మాదే.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
తహవుర్ రాణా అప్పగింతపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇది తమ ప్రభుత్వం సాధించిన విజయమని బీజేపీ పేర్కొనగా, తమ సర్కార్ హయాంలోనే అప్పగింత ప్రక్రియ ప్రారంభమైందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘‘టెర్రరిస్టులపై గత యూపీఏ సర్కార్ సున్నితంగా వ్యవహరించింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులపై కఠినంగా ఉన్నది. రాణాను ఇండియాకు తీసుకొచ్చి, గొప్ప విజయం సాధించింది” అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు బిర్యానీ పెట్టి రాచమర్యాదలు చేశారని విమర్శించారు. కాగా, బీజేపీ నేతల కామెంట్లకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ‘‘రాణాను ఇండియాకు తీసుకురావడంలో మోదీ సర్కార్ చేసిందేమీ లేదు. అతడి అప్పగింతపై అమెరికాతో కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే చర్చలు జరిపాం. దశాబ్దానికి పైగా దౌత్యపరంగా, చట్టపరంగా, ఇతర మార్గాల్లో ప్రయత్నాలు చేశాం. ఆనాడు మేం చేసిన కృషి ఫలితంగానే రాణాను అమెరికా అప్పగించింది. ఈ క్రెడిట్‌ను తీసుకోవాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నది” అని కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం విమర్శించారు.
ఆనాడు ఏం జరిగిందంటే?
2008 నవంబర్ 26న 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది చనిపోయారు. దాడులు ప్రారంభమైన వెంటనే భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాయి. నాలుగు రోజుల పాటు టెర్రరిస్టులతో పోరాడాయి. నవంబర్ 29 నాటికి 9 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మరణించగా, అజ్మల్ కసబ్ ఒక్కడు సజీవంగా పట్టుబడ్డాడు. ఇతణ్ని 2012లో ఉరి తీశారు. టెర్రరిస్టులతో జరిగిన పోరులో ఎన్‌ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సహా మరో ఇద్దరు ముంబై పోలీసులు వీర మరణం పొందారు. ఈ దాడులకు సూత్రధారి అయిన తహవూర్ రాణా.. 2009 అక్టోబరులో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి చిక్కాడు. అప్పటి నుంచి అక్కడి జైల్లో ఉంటున్న అతడిని అమెరికా మనకు అప్పగించింది. ఈ దాడులకు మాస్టర్ మైండ్ అయిన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ కూడా అమెరికాలోనే ఉన్నాడు. అయితే అతడి అప్పగింత విషయంలో అమెరికా సుముఖంగా లేదని తెలుస్తున్నది.
రాణా మా దేశస్తుడు కాదు: పాక్
ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రాణాను పాకిస్తాన్ తమ జాతీయుడిగా అంగీకరించడం లేదు. కెనడాకు వెళ్లిన తర్వాత తన పౌరసత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి తహవుర్ రాణా ఎటువంటి ప్రయత్నం చేయలేదని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ చెప్పారు. ఇస్లామాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తహవుర్ రాణా రెండు దశాబ్దాలకు పైగా తన పాకిస్తానీ పత్రాలను పునరుద్ధరించలేదని తెలిపారు. పాకిస్తాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని, అతడు కెనడియన్ జాతీయుడిని చాలా స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు.
కసబ్ ను కాల్చేద్దామనుకున్నా: 26/11 సర్వైవర్ దేవిక రోటావన్
ముంబైలో టెర్రరిస్టుల దాడి సూత్రధారి, లష్కరే తాయిబా టెర్రరిస్ట్ తహవూర్ హుస్సేన్ రాణాను అరెస్ట్ చేసి మనదేశానికి తీసుకురావడం పట్ల దాడి బాధితురాలు, టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌ను గుర్తించిన కీలక సాక్షి అయిన దేవికా రోటావన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది మన దేశానికి పెద్ద విజయమని అన్నారు. రాణాకు ఉరిశిక్ష విధించాలని, పాకిస్తాన్‌లో దాక్కుని దాడులకు కుట్రలు పన్నే ఇలాంటివాళ్లను కనిపెట్టి శిక్షించాలని ఆమె ఆకాంక్షించారు. దావూద్, హఫీజ్ సయీద్ లాంటి టెర్రరిస్టులనూ పట్టుకొచ్చి ఉరితీయాలన్నారు. కాగా, 26/11 ముంబై దాడి జరిగినప్పుడు దేవిక 9 ఏండ్ల వయసులో ఉన్నారు. ఆమె తన తండ్రి, సోదురుడితో కలిసి రైల్వే ప్లాట్‌ఫామ్ మీద వేచి చూస్తుండగా టెర్రరిస్టుల దాడి జరిగింది. వాళ్ల కాల్పుల్లో దేవిక కాలికి బులెట్ తగిలింది.
కుంభమేళానూ టార్గెట్ చేసిన్రు..
తహవ్వూర్ రాణా దేశంలోని మతపరమైన ఈవెంట్స్, రక్షణ దళాలతో సంబంధమున్న ప్రాంతాలను కూడా టార్గెట్ చేశాడని ఎన్ఐఏ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లోక్‌నాథ్ బెహెరా వెల్లడించారు. ముంబైలోని జల్ వాయు విహార్, కుంభమేళా అతని లిస్టులో ఉన్నాయని చెప్పారు. కొచ్చిన్‌పై కూడా దృష్టి సారించాడని.. అక్కడ అతను పలువురిని నియమించు కున్నాడని తెలిపారు. మన దేశంలో పనిచేస్తున్న పాకిస్తాన్ టెర్రర్ నెట్‌వర్క్‌లకు స్థానిక మద్దతును వెలికితీయడానికి తహవ్వూర్ ను విచారించడం చాలా అవసరమని పేర్కొన్నారు.
బహిరంగంగా ఉరి తీయాలి..
రాణాను బహిరంగంగా ఉరితీయాలని ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలర్పించిన పోలీసు తుకారాం ఓంబ్లే సోదరుడు ఏక్ నాథ్ ఓంబ్లే తెలిపారు. అతడికి సాధ్యమైనంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆ శిక్ష భారత్ పై దాడి చేయాలనుకున్నా టెర్రరిస్టులకు ఒక మెసేజ్ లా ఉండాలని వివరించారు.