265 మంది బాలలు మళ్లీ బడికి..ముగిసిన 11వ విడత ఆపరేషన్ ​స్మైల్​

265 మంది బాలలు మళ్లీ బడికి..ముగిసిన 11వ విడత ఆపరేషన్ ​స్మైల్​
  •     ఉమ్మడి జిల్లాలో 232 మంది బాలురు, 33 మంది బాలికల గుర్తింపు
  •     హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి 
  •     తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ ఇచ్చి అప్పగించిన అధికారులు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల కోటపల్లి మండలానికి చెందిన ఇద్దరు బాలురు టెన్త్ క్లాస్​ ఫెయిల్​అయ్యారు. అప్పటినుంచి ఫ్రెండ్స్​తో కలిసి జులాయిగా తిరుగుతున్నారు. దీంతో తల్లిదండ్రులు లక్సెట్టిపేటలోని ఓ హోటల్​లో పనిలో పెట్టారు. ఆపరేషన్ ​స్మైల్​ ప్రోగ్రాంలో భాగంగా అధికారులు వీరిని గుర్తించారు. బాలలను పనిలో పెట్టుకున్న హోటల్ ​యజమానిపై బీఎన్ఎస్​ 146, చైల్డ్​ లేబర్ యాక్ట్​ సెక్షన్ 14, జువైనల్​ జస్టిస్​ యాక్ట్​ సెక్షన్​ 79 కింద కేసు నమోదు చేశారు. లక్సెట్టిపేటలోని ఓ హోటల్​లో ఇద్దరు బాలకార్మికులను పనిలో పెట్టుకున్నందుకు యజమానిపై కేసు నమోదు చేశారు. 

బాలకార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్​ఇచ్చారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 265 మంది బాలబాలికలను అధికారులు గుర్తించారు. వివిధ కారణాలతో డ్రౌపౌట్స్​గా​ మారి రోడ్లపై తిరుగుతున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ నిర్వహించి మళ్లీ బడిబాట పట్టించారు. 

వివిధ శాఖల సమన్వయంతో..

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినవారు, వదిలివేయబడిన పిల్లలు, వివిధ కారణాలతో కిరాణా షాపులు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, కంపెనీల్లో పనిచేస్తున్న బాలకార్మికులను, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్​కు పంపిస్తున్నారు.

ఇందులో భాగంగా రామగుండం కమిషనరేట్​ పరిధిలో జనవరి 1 నుంచి 31వరకు 11వ విడత ఆపరేషన్​ స్మైల్​ చేపట్టారు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్​మెంట్​అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేశారు. 

జిల్లాల వారీగా వివరాలు..

రామగుండం పోలీస్​కమిషనరేట్​పరిధిలో బాలకార్మికులతో పాటు డ్రాపౌట్ బాలలు 88 మందిని గుర్తించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 74 మందిని, పెద్దపల్లి జిల్లాలో 14 మందిని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో బాలురు 55 మంది, బాలికలు19 ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 57 మంది బాలకార్మికులను గుర్తించామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. 

57 మంది బాలకార్మికుల్లో 54 మంది బాలురు, 3 బాలికలు ఉన్నారని, వారందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. ఆదిలాబాద్​ జిల్లాలో 68 మందికి అధికారులు విముక్తి కల్పించారు. అందులో 61 మంది అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇక నిర్మల్​ జిల్లాలో 62 మంది బాలురు, ఇద్దరు బాలికలను విముక్తి చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం 

బాల్యం ప్రతి ఒక్కరికి వరం లాంటిది. జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతుంది. వివిధ కారణాల వల్ల కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెడుతున్నారు. కొందరు పిల్లలు డ్రాపౌట్స్​గా మారి రోడ్లపై తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. ఇదే అదునుగా హోటళ్లు, దుకాణాలు, మెకానిక్​ షాపులు, ఇతర సంస్థల యజమానులు బాలలను పనిలో పెట్టుకొని వారి హక్కులను కాలరాస్తున్నారు. 

అటువంటి వారిపై కేసులు నమోదుచేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. బాలకార్మికుల సమాచారాన్ని చైల్డ్ హెల్ప్ లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్), డయల్​100కు కాల్ చేసి చెప్పాలి. 

- ఎం.శ్రీనివాస్​, సీపీ, రామగుండం