- పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ప్రమాదం
ఖాట్మండు: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయ టూరిస్ట్ బస్సు మర్సియాంగ్డి నదిలో పడిపోయి.. 27 మంది మృతిచెందారు. మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన బస్సు.. పోఖారా నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండు వైపు వెళ్తుండగా.. తనహున్ జిల్లాలోని ఐనా పహాడా వద్ద హైవే పై నుంచి 150 మీటర్ల లోతులో ఉన్న మర్సియాంగ్డి నదిలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కో-డ్రైవర్ సహా 43 మంది ఉన్నారు. నేపాల్ పర్యటన కోసం రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి మూడు బస్సుల్లో 104 మంది ప్రయాణికులు బయలుదేరారు.
పోఖారాలో రెండు రోజులు గడిపి ఆపై శుక్రవారం ఉదయం 3 బస్సుల్లో ఖాట్మండుకు బయలుదేరారు. వాటిలో ఒక బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో స్పాట్లోనే 16 మంది చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మరో పదహారు మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని నిర్దారిస్తూ భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సహాయక చర్యలు చేపడుతున్న స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, నేపాల్ ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ కోసం వైద్య బృందంతో ప్రమాద స్థలానికి బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సహాయక చర్యల కోసం తమ సిబ్బందిని పంపినట్టు వెల్లడించింది.