హైదరాబాద్ లోని పేద మైనారిటీ పిల్లల్లో 27 శాతం డ్రాపౌట్స్

హైదరాబాద్ లోని పేద మైనారిటీ పిల్లల్లో 27 శాతం డ్రాపౌట్స్

 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో నివసించే పేద మైనారిటీ పిల్లల్లో 27 శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నారని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్ హెచ్ఎఫ్) ప్రతినిధి ముజ్తబా హసన్ అస్కారీ తెలిపారు. నాలుగు శాతం మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని చెప్పారు. జల్‌‌‌‌పల్లి మునిసిపల్ పరిధిలోని ఎర్రకుంటలో వలస కార్మికుల పిల్లల కోసం హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ ప్రైమరీ కమ్ బ్రిడ్జ్ స్కూల్‌‌‌‌ను సీడ్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్ హుస్సేనీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముజ్తబా హసన్ అస్కారీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అభ్యసించేందుకు పిల్లలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సిటీలోని మురికివాడల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు.

హకీంపేట, ఎండీ లైన్లు, రాజేంద్రనగర్, కిషన్‌‌‌‌బాగ్, ఖ్యామ్‌‌‌‌నగర్, హసానగర్, కాలాపతేర్, ఎర్రకుంట, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్, జల్‌‌‌‌పల్లి వంటి 15 పైగా ప్రధాన మురికివాడల్లోని బలహీన వర్గాల పిల్లల విద్యా స్థితిపై సర్వే చేశామన్నారు.  మూడు నెలల వ్యవధిలో 2500 కుటుంబాలను ఇంటర్వ్యూ చేశామని తెలిపారు. ఈ సర్వేలో పేద మైనారిటీ పిల్లల్లో 27 శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నట్లు తేలిందన్నారు. పట్టణ మురికివాడల్లోని 756 ప్రభుత్వ పాఠశాలలను మ్యాప్ చేశామన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో 50 శాతం మంది బడి మానేశారని వివరించారు. డ్రాపౌట్ పిల్లల తల్లిదండ్రులలో దాదాపు 65 శాతం మంది మహారాష్ట్ర, కర్నాటక, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారేనని హసన్ అస్కారీ పేర్కొన్నారు.