
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓఆర్అర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి 273 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు.
బాలానగర్ ఏస్వోటీ, సివిల్ పోలీసులు కలిసి పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. బోయిన్ పల్లి లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ నడుపుతున్న పంజాబ్ కు చెందిన పర్దీప్ కుమార్ కు సోహెల్ పరిచయం అయ్యాడు. సోహెల్ పై గతంలో ఏన్డీపీఏస్ చట్టం ప్రకారం కేసు నమోదు అయ్యింది ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. పర్దీప్ కుమార్ కు సోహెల్ తన వద్ద ఉన్న బోలేరో వాహనంలో గంజాయి తరలించి సొమ్ము చేసుకోవచ్చని ఆశ చూపాడు. వీరు ఇద్దరు ఒడిస్సాలో గంజాయిలో అమ్మకాలు జరిపే సుభి బిశ్వాస్ ను కలిశారు.
ఈ మేరకు పథకం ప్రకారం హర్యానాకు చెందిన డ్రైవర్ సన్నీ, హెల్పర్ మనీష్ కుమార్ కు గంజాయి సరఫరా తీసుకురావాలని సూచించి సుభాష్ కు రూ,1,25 లక్షలు చెల్లించారు. అక్కడి నుంచి వాహనంలోని సామగ్రి మద్యలో బాక్స్ లో ప్యాకింగ్ చేసుకుని పకడ్బందీగా తీసుకుని వచ్చేలా ఫోన్ లు చేసుకోకుండా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంచుకుంటూ వస్తున్నారు. ఎస్వోటీ పోలీసులకు ఉన్న పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడిలో రూ,95 లక్షల విలువ చేసే ఎండు గంజాయి, బోలేరో వాహనం, మొబైల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అని తెలిపారు.