- 12 నియోజకవర్గాల్లో 276 మంది పోటీ
- 79 మంది నామినేషన్ల ఉపసంహరణ
- 15 మంది అభ్యర్థులు దాటిన చోట రెండేసి ఈవీఎంలు
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. బుధవారం నామినేషన్ల విత్ డ్రా పూర్తి కావడంతో పోటీలో ఉండే అభ్యర్థులను గుర్తులతో సహా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 385 మందిలో 79 మంది విత్ డ్రా చేసుకోగా.. 276 మంది అభ్యర్థులు మిగిలారు. ఇందులో నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 184 మంది నామినేషన్లు దాఖలు చేయగా 40 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. 144 మంది అభ్యర్థుల పేర్లను, పార్టీల వివరాలను అధికారులు ప్రకటించారు. సాగర్‌లో 15, దేవరకొండలో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిర్యాలగూడలో 23, నల్గొండలో 31, మునుగోడులో 39, నకిరేకల్‌లో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
భువనగిరి, ఆలేరులో 40 మంది బరిలో..
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 47 నామినేషన్లు ఫైనల్ కాగా.. ఏడుగురు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. ఆలేరులో 21 మంది , భువనగిరిలో 19 మంది పోటీలో ఉన్నారు. భువనగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి,కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి సహా మరో 16 మంది రిజిస్ట్రర్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గొంగిడి సునీత, బీర్ల అయిలయ్య, పడాల శ్రీనివాస్‌తో పాటు మరో 18 మంది బరిలో నిలిచారు.
పేటలో 92 మంది అభ్యర్థులు
సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 154 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. స్క్రూట్నీలో 30 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. 124 నామినేషన్లు ఒకే కాగా.. 32 నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. 92 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నియోజక వర్గాల వారీగా హుజూర్ నగర్‌లో 24మంది, కోదాడలో 34 మంది, సూర్యాపేటలో 20మంది తుంగతుర్తిలో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, 15 మంది అభ్యర్థులు దాటిన చోట రెండేసి ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో నాగార్జునసాగర్, దేవరకొండ, తుంగతుర్తి మినహా మిగితా నియోజకవర్గాల్లో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.
యుగ తులసీ పార్టీకి రోడ్డు రోలర్..
రిజిష్టర్ పార్టీలకు ప్రకటించిన గుర్తుల్లో అధికార పార్టీ కారు గుర్తు పోలిన రోడ్డు రోలర్ సింబల్యుగ తులసీ పార్టీకి కేటాయించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నకిరేకంటి అన్నపూర్ణ యుగతులసీ పార్టీ తరపున పో టీలో ఉన్నారు. 2018 ఎన్నికలతో సహా, జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్, ట్రాక్టర్ ట్రక్కు సింబల్ అధికార పార్టీ గెలుపుకు అడ్డుపడ్డాయని పార్టీ హైకమాండ్ ఎన్నికల కమిషన్‌కు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ గుర్తు 2018లో నకిరేకల్ వీరేశం ఓటమికి కారణమైంది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లోనూ రోడ్డు రోలర్ గుర్తు రావడంతో ఆ సింబల్‌ను తొలగించే క్రమంలో ఎన్నికల రిటర్నింగ్అధికారి సస్పెండ్ అయ్యారు.