- గ్రేటర్ చూపు.. సోలార్ వైపు
- 9 సర్కిళ్లలో 27,604 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
- ప్రతి నెలా 349 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి
- సూర్యఘర్ స్కీం కింద ప్యానల్స్‌పై కేంద్రం సబ్సిడీ
- ఆసక్తి చూపిస్తున్న నగరవాసులు
హైదరాబాద్: గ్రేటర్ లో సోలార్ విద్యుత్ వాడకం క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్సూర్యఘర్ స్కీం కింద 9 సర్కిళ్లలో 27,604 మంది తమ ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ఏర్పాటు చేసుకుని 349 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి చేస్తున్నారు. హబ్సిగూడలో 5,788 ప్యానెల్స్‌తో 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, మేడ్చల్ లో 4550 ప్యానెల్స్‌తో 74 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 3 కిలో వాట్ నుంచి మొదలుకుని 50 కిలో వాట్ కెపాసిటీ ఇస్తున్నప్యానల్స్ పై కేంద్రం 40 నుంచి 60 శాతం సబ్సిడీ ఇస్తుండడంతో జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. కొత్తగా నిర్మించుకుంటున్న అపార్ట్‌మెంట్ వాసులు, విల్లాల యజమానులు కూడా తమ ఇండ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తే సోలార్ విద్యుత్‌ఉత్పత్తి మరింత పెరుగుతుందని సోలార్ విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
యూనిట్‌కు 4.99 పైసలు ఇస్తారు
సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో ఇండ్లలో వాడుకున్న తర్వాత మిగిలింది నెట్‌మీటర్ ద్వారా గ్రిడ్‌కు పంపిస్తారు. దీనికి సంబంధించి విద్యుత్ యూనిట్ల లెక్క నెట్‌మీటర్‌లో నమోదవుతుంది. సోలార్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లను, రెగ్యులర్ మీటర్ లో వచ్చే యూనిట్ల నుంచి తీసివేసి మిగితా యూనిట్లకు బిల్ చేస్తారు. ఉదాహరణకు సోలార్ ద్వారా 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందనుకుందాం. రెగ్యులర్ మీటర్ లో 500 యూనిట్ల విద్యుత్ ను వాడుకున్నారు. ఇందులో 500 యూనిట్ల నుంచి 200 యూనిట్లను మైనస్ చేసి 300 యూనిట్లకు మాత్రమే బిల్ ఇస్తారు. ఒక వేల చాలా రోజులు ఇంట్లో లేకపోయినా, రెగ్యులర్ విద్యుత్ వాడని టైంలో ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్ యూనిట్లను 6 నెలలకు ఒకసారి రెగ్యులర్ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తుంటారు. యూనిట్‌కు రూ.4.99 పైసల చొప్పున లెక్క గట్టి ఇస్తారు. దీన్నే పూలింగ్ కాస్ట్ అంటారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇలా..
ప్రధాని మోదీ సూర్య ఘర్ పథకాన్ని 2024 ఫిబ్రవరి లో ప్రారంభించారు. రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ కోసం సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సీఎఫ్ఏ) ద్వారా ఆసక్తి ఉన్న కుటుంబాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 3 కిలో వాట్ నుంచి 50 కిలో వాట్కెపాసిటీ ప్యానల్స్ ఇవ్వడంతో పాటు 40 నుంచి 60 శాతం సబ్సిడీ కూడా ఇస్తారు. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ ఎంపిక ప్రజలకే వదిలేస్తున్నారు. నచ్చిన కంపెనీ ప్యానల్స్ ను కొనుక్కోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఇన్స్టలేషన్తర్వాత కరెంట్ ఆఫీసులో అప్లై చేసుకుంటే ఎలాంటి చార్జీలు లేకుండానే రెగ్యులర్ మీటర్ కు నెట్ మీటర్ లింక్ చేస్తారు.
గ్రేటర్లో సర్కిళ్ల వారీగా సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ ఉత్పత్తి..
సర్కిల్ పేరు సోలార్ ప్యానెళ్ల సంఖ్య విద్యుత్ ఉత్పత్తి(మెగా వాట్లలో)
1. సైబరాబాద్ 3,358 55
2. హబ్సిగూడ 5,788 50
3. బంజారాహిల్స్ 2,212 27
4. హైదరాబాద్ సెంట్రల్ 1,473 15
5. హైదరాబాద్ సౌత్ 1,220 10
6. మేడ్చల్ 4,550 74
7. రాజేంద్రనగర్ 2,025 65
8. సరూర్ నగర్ 4,239 27
9. సికింద్రాబాద్ 2,739 26
మొత్తం 27,604 349
గ్రేటర్‌లోని 9 సర్కిళ్లలో 27,604 ఇండ్లపై ఉన్న సోలార్ ప్యానెళ్లతో మొత్తం 400 మెగావాట్ల కెపాసిటీ ఉండగా.. 349 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. అందులో మేడ్చల్‌లో 4,550 ప్యానెల్స్‌తో అత్యధికంగా 74 మెగావాట్లు, హబ్సిగూడలో 5,788 సోలార్ ప్యానెల్స్‌తో 50 మెగావాట్ల పవర్ ఉత్పత్తి జరుగుతున్నది. అత్యల్పంగా హైదరాబాద్ సౌత్‌లో 1,220 ప్యానళ్లతో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది.