
- మంగాపురం తండా, నేలకొండపల్లి రెవెన్యూ సదస్సులో అధికారులు
- మూడో రోజు 277 దరఖాస్తులు
నేలకొండపల్లి, వెలుగు : --భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని భూ సేకరణ స్పెషల్డిప్యూటీ కలెక్టర్, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎం. రాజేశ్వరి తెలిపారు. శనివారం నేలకొండపల్లి మండలం మంగాపురం తండా, నేలకొండపల్లి గ్రామాల్లో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో అభద్రకు తావునీయకుండా జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని చేపట్టినట్లు తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు లాంటి సేవలు సులభమవుతాయన్నారు. మంగాపురం తండా గ్రామంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో 223, నేలకొండపల్లిలో 54 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, తఫజ్జుల్ హుస్సేన్, నాయబ్ తహసీల్దార్ ఇమ్రాన్, ఆర్ఐలు మధు, రవి, నాయకులు బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న, జెర్రిపోతుల సత్యనారాయణ, వంగవీటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.