దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఓ వైపు కరోనా వైరస్ కొత్త వేవ్ ఒమిక్రాన్ భయం వెంటాడుతుంటే.. మరోవైపు దేశంలో ఇప్పటికే నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. తాజాగా దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కు చేరింది. ఇందులో 3,40,60,774 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.అయితే గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కొత్తగా 2,796 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఇప్పటివరకు 4,73,326 మంది కరోనాకు బలవగా, 99,155 మంది చికిత్స పొందుతున్నారు. 6,918 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కరోనా రికవరీరేటు 98.35 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.29 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,27,61,83,065 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.
ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 138 కోట్ల డోసులు పంపిణీ చేశామని, ఇంకా 21.13 కోట్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అయితే కొత్త వేవ్ భయంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు కూడా జనం ముందుకు వస్తున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే కోటి మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.