జ్యోతిషం పేరుతో మహిళ నుంచి రూ.28లక్షలు స్వాహా... నలుగురి అరెస్ట్​

పద్మారావునగర్, వెలుగు: జ్యోతిషం పేరుతో భయబ్రాంతులకు గురిచేసి ఓ మహిళ నుంచి రూ. 2 8లక్షల32వేలను లాగిన నలుగురిని గాంధీనగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇన్ స్పెక్టర్​ డి.రాజు వివరాల ప్రకారం... బన్సీలాల్​పేట డివిజన్​ న్యూ బోయిగూడ కు చెందిన మంత్రి జయనందిని వద్దకు కిందటి నెల కొందరు యువకులు వచ్చారు. తాము జ్యోతిషం తో, పూజలతో సమస్యలను దూరం చేస్తామని నమ్మించారు.

ఈ క్రమంలో పూజలు, మంత్రాల కోసం డబ్బులు కావాలని ఐదు దఫాలుగా డబ్బులు వసూలు చేశారు. మరోసారి డబ్బుల కోసం  తీవ్ర ఒత్తిడి చేయగా.. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. బాపూజీ నగర్​ లో ఉంటున్న నలుగురు పూర్ణం నాగరాజు (33), ఎర్నాల వాసు (40), కిన్నెర సాయి(30), పూర్ణం నివాస్​ (19) ను రిమాండ్​కు తరలించారు. వీరంతా ఏపీలో వెస్ట్ గోదావరి జిల్లా కు చెందిన వారని సీఐ తెలిపారు. వారి నుంచి మొత్తం నగదు 28 లక్షల 32 వేలను రికవరీ చేశామన్నారు.