బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.50) టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. కాకతీయ కాల్వకు నీటి విడుదల నిలిపి వేసిన ఆఫీసర్లు ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
కాకతీయ కాల్వకు నీటి విడుదల నిలిపివేయడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 19 వేల క్యూసెక్కులు, సరస్వతీ కాల్వకు 400, లక్ష్మీ కాల్వకు 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ సీజన్‌లో ఎగువ నుంచి ప్రాజెక్ట్‌కు 176.92 టీఎంసీల నీరు రాగా ఇప్పటివరకు 103.82 టీఎంసీల నీటిని బయటకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు చెప్పారు.