
బాసర, వెలుగు: ప్రతి ఒక్కరూ సంత్ సేవాలాల్ అడుగుజాడల్లో నడవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలను ఆదివారం బాసర పుణ్యక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ రావు చవాన్, ఎంపీ గొడం నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు, బొజ్జు పటేల్, అనిల్ జాదవ్ పాల్గొని సేవాలాల్ ఫొటోకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీలు, బంజారాలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం క ట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం వీరి సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
బాసరలో బంజారా మందిర్ ఏర్పాటు చేయాలి
బాసర అమ్మవారి క్షేత్రంలో 42 రోజుల పాటు తపస్సు చేసిన సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని ఇక్కడ నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బంజారా సమాజానికి ఐదెకరాల భూమి కేటాయించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతానన్నారు. బంజారాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. బాసర గోదావరి నది ఒడ్డున నిర్వహించిన భోగ్బండార్ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి బంజారా కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి వచ్చిన 15 వేల మందికి ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నదానం చేశారు. కార్యక్రమంలో పౌర గాడ్ పీఠాధిపతి బాబుసింగ్ మహారాజ్, దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.