పక్కాగా ఎల్ఆర్ఎస్​ సర్వే

పక్కాగా ఎల్ఆర్ఎస్​ సర్వే
  • క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్న ప్రత్యేక టీమ్​లు
  • అర్హత కలిగిన వాటికే అప్రూవల్ ​ఇస్తున్న అధికారులు
  • జిల్లాలో  మొత్తం 1.03 లక్షల దరఖాస్తులు పెండింగ్​

సిద్దిపేట, వెలుగు: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్  రెగ్యులరైజ్  స్కీం) దరఖాస్తుల పరిశీలనకు జిల్లాలో  29 ప్రత్యేక టీమ్ లు రంగంలోకి దిగాయి. వీటిలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్​ ప్రక్రియను ముగించాలని ఆదేశించడంతో సర్వేను స్పీడప్​ చేశారు. ఇటీవల అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అధికారులు యాప్​లో వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా తనిఖీ చేశారు.

 కాగా జిల్లాలో ఇప్పటివరకు 1,03,694  దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి.  సిద్దిపేట మున్సిపాల్టీలో 32,358,  గజ్వేల్​లో,11,544, దుబ్బాకలో1,884,  హుస్నాబాద్ లో 6,056, చేర్యాలలో 6,069,   సిద్దిపేట అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ(సుడా) పరిధిలో 21,310,  గ్రామ పంచాయతీల పరిధిలో 21,401 దరఖాస్తులు అందాయి. హెచ్ఎండీఏ పరిధిలోని ములుగు, మర్కుక్, వర్గల్ మండలాలకు సంబంధించి 3,042 దరఖాస్తులు అందాయి.

సర్వే స్పీడప్..

ఒక్కో టీమ్ దరఖాస్తుదారుడి ప్లాట్​నాలా, బఫర్ జోన్, చెరువు శిఖం, డిఫెన్స్ భూములకు సంబంధం లేదని నిర్థారించిన తర్వాతనే అప్రూవల్ ఇస్తున్నారు.​ కొన్ని ప్రాంతాల్లో ఫేక్ ఎన్​వోసీలతో ప్రభుత్వ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి భూములను ఎల్ఆర్ఎస్​ను అనుమతించడం లేదు.

 సర్వే సిబ్బంది ముందుగా ఫీల్డ్ కు వెళ్లి దరఖాస్తుదారుడు ఆన్​లైన్​లో నమోదు చేసిన  స్థలం వివరాలను పరిశీలిస్తున్నారు. వారు గమనించిన అంశాలను ఆయా గ్రామాలు, మున్సిపాల్టీల్లోని  జీపీఎస్ ద్వారా ఎల్ఆర్ఎస్  ఇన్​స్పెక్షన్  యాప్ లో నమోదు చేస్తున్నారు. అలాగే దరఖాస్తుదారుడి  లేఔట్,​ ఓనర్షిప్ డాక్యుమెంట్, ఈసీ, స్థలం ఫొటోలు, రోడ్డు విస్తీర్ణం,  స్థలం లొకేషన్ వంటి  వివరాలను సైతం నమోదు చేస్తారు.

 సర్వే  సమయంలో దరఖాస్తుదారుడికి  సమాచారం ఇచ్చి అతడి సమక్షంలో వివరాలను సేకరిస్తున్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఆయా ప్లాట్లను ఆమోదించిన తర్వాత అర్హత కలిగిన దరఖాస్తులను  ఎల్1, ఎల్ 2 కు లాగిన్ చేస్తున్నారు. తర్వాత రెగ్యులరైజేషన్ ఫీజుకు రికమెండ్ చేసి అది పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుడికి  ఎల్ఆర్ఎస్ పత్రాలను జారీ చేస్తున్నారు. 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సందేహాల నివృత్తి కోసం కలెక్టర్ ఆఫీసుతో పాటు అన్ని మున్సిపల్, తహసీల్దార్, ఇరిగేషన్, సుడా  ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్ ను రిజెక్ట్ చేస్తున్నాం. 

- ‌‌ గరిమ అగర్వాల్, అడిషనల్ కలెక్టర్