- చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నేతన్నకు చేయూత పథకం కింద చేనేత కార్మికులకు రూ.290 కోట్లు విడుదల చేయడంతో పాటు రూ.465 కోట్ల బకాయిలను చెల్లించామని చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. ప్రజాపాలన– ప్రజావిజయోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ లోని కమ్మ సంఘం భవనంలో స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పోను ప్రారంభించారు. దీనికి శైలజ రామయ్యర్ చీఫ్ గెస్టుగా హాజరై, మాట్లాడారు. " టెస్కోకు రావాల్సిన బకాయిలు మొత్తం రూ.488.38 కోట్లలో రూ. 465 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
దీని ద్వారా నేత కార్మికులకు నిరంతరంగా పని కల్పించుటకు అవకాశం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ సంస్థలకు కావలసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. దీని ద్వారా రాష్ట్రంలో చేనేత పవర్ లోన్ పరిశ్రమల అభివృద్ధితోపాటు నేత కార్మికులకు నిరంతర ఉపాధి ఉంటుంది. అలాగే.. నూలు డిపోను నడపడానికి రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్ ను ప్రభుత్వం మంజూరు చేసింది.
నేతన్నకు చేయూత పథకం కింద నమోదు చేసుకున్న చేనేత కార్మికులకు రూ. 290 కోట్లు విడుదల చేసింది. తద్వారా 36,333 చేనేత కార్మికులకు, అనుబంధ కార్మికులు లబ్ధి పొందనున్నారు. మరమగ్గాల కార్మికులకు రూ.5.45 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులతో9,576 మంది పవర్ లూమ్ వీవర్స్, అనుబంధ కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. నేతన్న బీమా కింద రూ. 22కోట్లు నామినీల ఖాతాలకు జమ అయ్యాయి" అని శైలజ రామయ్యర్ పేర్కొన్నారు.