నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈనెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే రేంజ్లో సినిమా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. వివేక్‌కు ఇది మైల్ స్టోన్‌లా ఉంటుంది. కచ్చితంగా అందర్నీ ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. మంచి సినిమాలు వస్తే.. పోతారు.. అందరూ థియేటర్స్‌కు పోతారు’ అని అన్నాడు.
ఇది తనకు స్పెషల్ ఫిలిం అని చెప్పింది ప్రియాంక అరుల్ మోహన్. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘నాని నాకు ఇచ్చింది చాన్స్ కాదు.. కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి ఈ సినిమా ఇచ్చా’ అని అన్నాడు. ‘కథల ఎంపికలో నాని బెస్ట్. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు దేవకట్టా, శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలను, శౌర్యవ్, ప్రశాంత్ వర్మ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. నటులు ఎస్.జె. సూర్య, అలీ, అతిథి, అనిత చౌదరి, అభిరామి, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులు పాల్గొన్నారు.