- డబుల్ఇండ్లు ఓపెన్ చేసి ఎవరికీ ఇయ్యలే
- హద్దులు లేకుండా ఇంటి స్థలాల పంపిణీ
- ఎన్నికల కోడ్ వస్తుందంటూ అధికార పార్టీ నేతల హడావుడి
గద్వాల, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఓపెన్ చేసినా, ఎవరికి ఏ ఇల్లు కేటాయించారో తెలియదు.. పట్టాలు పంపిణీ చేసినా, స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. పట్టాలు ఇచ్చిన స్థలం గుట్టలు, రాళ్లు, వాగులు వంకలతో నిండి ఉంది. ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. డిప్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారికి ఏ ఫ్లాట్ కేటాయించారో తెలియక, ఓపెన్ప్లాట్లకు సంబంధించి నెంబర్లు ఇచ్చినా అక్కడ రాళ్లు, రప్పలు ఉండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక కోడ్ వస్తుందన్న సమాచారంతో సోమవారం హడావుడిగా రూ.100 కోట్ల పనులను ఎమ్మెల్యే ఓపెనింగ్, శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి ఓపెనింగ్ లు, భూమిపూజలు చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష లీడర్లు విమర్శిస్తున్నారు.
ఐదేండ్లుగా ఎదురుచూపులు..
గద్వాల నియోజకవర్గంలోని ఇల్లు లేని వారు డబుల్ ఇండ్ల కోసం ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గద్వాల నియోజకవర్గానికి 2,500 డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందులో 4 వేల మందికి పైగా అర్హులు ఉన్నారని తేల్చారు. పేదలకు గతంలో ఇచ్చిన ఇండ్ల పట్టాలు గుంజుకుని 1,275 ఇండ్లు కట్టారు. ఆరు నెలల కింద 1,275 ఇండ్ల లో కోర్టుకు వెళ్లిన వారికి 505 ఇండ్లు పక్కకి పెట్టి మిగిలిన ఇండ్లకు గద్వాల మున్సిపాలిటీలోని వార్డుల్లో ఆఫీసర్లు లక్కీడిప్ చేశారు.
అయినా ఇప్పటివరకు ఇండ్లు కేటాయించలేదు. అయితే తాజాగా సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హడావుడిగా ఇండ్లను ఓపెన్ చేశారు. ఇండ్లు ఓపెన్ చేస్తే లబ్ధిదారులను తీసుకెళ్లి పాలు పొంగించి గృహప్రవేశం చేయించాలి. ఆఫీసర్లు, ఎమ్మెల్యే ఎవరికీ చెప్పకుండా అరగంటలో ఓపెన్ చేసేసి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలున్నాయి. డిప్లో ఎంపికైన వారు తమకు ఏ ఇల్లు కేటాయించారో తెలియక కౌన్సిలర్లు, బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల కోడ్ రావడంతో తమకు ఇండ్లు కేటాయిస్తారో? లేదోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేపర్ల పైనే ప్లాట్లు..
రోడ్లు వేయకుండా, ప్లాట్ల హద్దుల కోసం రాళ్లు పాతకుండా పొలం, గుట్టలు, రాళ్లు, రప్పలు, వాగులు, వంకలు ఉన్న స్థలంలో ప్లాట్లు ఇవ్వడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గద్వాల శివారులోని సర్వే నంబర్ 194 లో 70 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది. ఇందులో 8 ఎకరాల వరకు గుట్టలు ఉన్నాయి. 1975లో అసైన్డ్ భూమిలో 62 ఎకరాలను 40 మంది రైతులకు పట్టాలిచ్చారు. వాటిని గుంజుకొని ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు, ఎమ్మెల్యే రెడీ అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.
62 ఎకరాల్లో 36 ఎకరాల భూములు గుంజుకొని ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండానే 20× 34 (75 గజాలు) చొప్పున 1,109 మందికి ప్లాట్లు ఇచ్చేందుకు పేపర్లపై ప్లాన్ రెడీ చేశారు. సోమవారం కొందరికి ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేశారు. హద్దులు లేకుండా, ప్లాట్లు వేయకుండా గుట్టల్లో ఇంటి స్థలాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొందరికి మాత్రమే ఇచ్చిన్రు..
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్లాట్ల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించిన మాట వాస్తవమే. ఐదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు. పట్టాల్లో వారికి నెంబర్ అలాట్ చేశాం. ఇండ్ల పట్టాలు కూడా కొందరికే అందజేశారు. మిగిలిన వారికి ఎలా ఇస్తారనేది పై ఆఫీసర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
- నరేందర్, తహసీల్దార్, గద్వాల