జెమీమా ధమాకా..రోడ్రిగ్స్‌‌ సెంచరీ.. రెండో వన్డేలో 116 రన్స్​​తో ఐర్లాండ్‌‌‌‌పై గెలుపు

రాజ్‌‌కోట్‌‌:  ఇండియా అమ్మాయిల జట్టు తిరుగులేని ఆటతో  అదరగొడుతోంది. జెమీమా రోడ్రిగ్స్ (91 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 102) కెరీర్‌‌‌‌లో తొలి సెంచరీకి తోడు టాప్‌‌–3 బ్యాటర్లూ సత్తా చాటడంతో వన్డేల్లో తమ అత్యధిక స్కోరుతో రికార్డు సృష్టించింది. బౌలర్లు కూడా మెప్పించడంతో  ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 116 రన్స్‌‌ తేడాతో ఐర్లాండ్‌‌పై ఘన విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ ఏకపక్ష మ్యాచ్‌‌లో తొలుత ఇండియా 50 ఓవర్లలో 370/5 స్కోరు చేసింది. 

హర్లీన్ డియోల్ (84 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 89),  కెప్టెన్ స్మృతి మంధాన (54 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 73),  ప్రతీక రావల్ (61 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1సిక్స్‌‌తో 67) ఫిఫ్టీలతో రాణించారు. ఐరిష్​ బౌలర్లలో అర్లెన్‌‌ కెల్లీ, ఓర్లా ప్రెండర్‌‌‌‌గాస్ట్‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌లో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 254/7 స్కోరు చేసింది. క్రిస్టినా కౌల్టర్ రీలీ (80) టాప్ స్కోరర్‌‌‌‌. ఆతిథ్య బౌలర్లలో స్పిన్నర్ దీప్తి శర్మ మూడు వికెట్లు, ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టారు. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో, చివరి వన్డే బుధవారం జరుగుతుంది.

ధనాధన్ ఫటాఫట్‌‌

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా ఆరంభం నుంచి ధనాధన్ బ్యాటింగ్‌‌తో పరుగుల మోత మోగించింది. కెప్టెన్‌‌ స్మృతి మంధాన, యంగ్ ఓపెనర్ ప్రతీక రావల్ తమ ఫామ్‌‌ను కొనసాగించారు. ఇద్దరూ పోటీపడి బౌండ్రీలు కొట్టడంతో పవర్‌‌‌‌ప్లేలోనే 75 రన్స్ వచ్చాయి.  క్రీజులో  కుదురుకున్న తర్వాత  మంధాన మరింత స్పీడు పెంచింది.  మార్కు స్టయిలిష్ షాట్లతో బౌండ్రీలు కొట్టడంతో స్కోరుబోర్డు ఉరకలు పెట్టింది. ఈ క్రమంలో తను 34 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 13 ఓవర్లకే స్కోరు 100 దాటింది. మరో ఎండ్‌‌లో ప్రతీక 53 బాల్స్‌‌లో ఫిఫ్టీ అందుకుంది. వీళ్ల జోరుకు 18.3  ఓవర్లలోనే స్కోరు 150 మార్కు చేరుకుంది. అదే ఓవర్లో మంధానను ప్రెండర్‌‌‌‌గాస్ట్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌‌కు 156 రన్స్ భారీ భాగస్వామ్యం బ్రేక్ అయింది. తర్వాతి బాల్‌‌కే ప్రతీకను డెంప్సే ఎల్బీ చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హర్లీన్‌‌, జెమీమా కూడా జోరు కొనసాగించారు. ఐర్లాండ్‌‌ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్వేచ్ఛగా షాట్లు కొట్టారు.  వీళ్ల జోరుకు 30 ఓవర్లలో స్కోరు 200 దాటింది. సమయం గడుస్తున్న కొద్దీ ఈ ఇద్దరూ మరింత వేగంగా బ్యాటింగ్ చేశారు. వెంటవెంటనే ఫిఫ్టీలు పూర్తి చేసుకొని 43.1 ఓవర్లకే స్కోరు 300 దాటించారు. స్లాగ్ ఓవర్లలో జెమీమా, హర్లీన్ మరింత ధాటిగా ఆడారు. ఇద్దరూ సెంచరీలు చేసేలా కనిపించినా.. 48వ ఓవర్లో కెల్లీ బౌలింగ్‌‌లో హర్లీన్‌‌ ఔటైంది. దాంతో మూడో వికెట్‌‌కు 183 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. కెల్లీ వేసిన ఆఖరి ఓవర్లో ఫోర్‌‌‌‌తో సెంచరీ పూర్తి చేసుకున్న జెమీమా.. బ్యాట్‌‌తో గిటార్ ప్లే చేస్తున్నట్టు పోజు ఇచ్చి సంబరాలు చేసుకుంది. తర్వాతి బాల్‌‌కు ఆమె ఔటైనా.. ఇండియా రికార్డు స్కోరుతో ఇన్నింగ్స్‌‌ను ముగించింది.

బౌలర్ల జోరు

భారీ టార్గెట్‌‌  ఛేజింగ్‌‌లో ఐర్లాండ్ ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ఆతిథ్య బౌలర్లు ఆ జట్టును కట్టడి చేయడంలో విజయం సాధించారు.  ఇన్నింగ్స్‌‌ ఎనిమిదో ఓవర్లోనే ఓపెనర్ గాబీ లూయిస్ (12)ను ఔట్‌‌ చేసిన సయాలీ జట్టుకు బ్రేక్ ఇచ్చింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన క్రిస్టినా.. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్ (38)తో రెండో వికెట్‌‌కు 55 రన్స్‌‌, లారా డెలానీ (37)తో నాలుగో 83 రన్స్ జోడించి ఆకట్టుకుంది. కానీ, సారా, డెలానీని స్పిన్నర్ దీప్తి వెనక్కుపంపగా.. సెంచరీ దిశగా వెళ్తున్న క్రిస్టినాను పేసర్ టిటాస్ ఔట్‌‌ చేయడంతో ఐర్లాండ్‌‌ ఓటమి ఖాయమైంది. అల్రీన్ కెల్లీ (19), కానింగ్ (11)తో కలిసి   లియా పాల్‌‌ (27 నాటౌట్‌‌) చివరి వరకూ క్రీజులో నిలిచినా.. ఆ జట్టుకు భారీ ఓటమి తప్పలేదు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 370/5 (జెమీమా 102, హర్లీన్‌‌ 89,  మంధాన 73, ప్రెండర్‌‌‌‌గాస్ట్  2/75).
ఐర్లాండ్: 50 ఓవర్లలో 254/7 (క్రిస్టినా 80, 
దీప్తి శర్మ 3/37).

1 వన్డేల్లో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు. 2017లో ఐర్లాండ్‌‌పై 358/2, గత నెలలో వెస్టిండీస్‌‌పై చేసిన 358/5 
స్కోర్ల రికార్డును బ్రేక్‌‌ చేసింది.

2 ఈ మ్యాచ్‌‌లో 90 బాల్స్‌‌లో సెంచరీ చేసిన జెమీమా ఇండియా తరఫున వేగంగా వంద రన్స్‌‌ కొట్టిన రెండో బ్యాటర్‌‌‌‌గా నిలిచింది. హర్మన్‌‌ 87 బాల్స్‌‌లో సెంచరీ చేసింది.

3 మంధాన, ప్రతీక  గత ఐదు ఇన్నింగ్స్‌‌ల్లో తొలి వికెట్‌‌కు వంద రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ చేయడం ఇది మూడోసారి.